ఆర్‌సెప్‌పై మోదీ తగ్గడం మా విజయమే

Opposition leader Ghulam Nabi Azad in Rajya Sabha with reporters - Sakshi

ఒప్పందం జరిగితే చైనా వ్యాపారానికి భారత్‌ డంపింగ్‌గ్రౌండ్‌గా మారేది

విలేకరులతో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సెప్‌)పై సంతకం చేయకుండా ప్రధాని మోదీ వెనక్కు తగ్గడం కాంగ్రెస్‌ విజయమని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఈ ఒప్పందం కారణంగా దేశానికి జరిగే ఆర్థిక నష్టాలపై ఇతర ప్రతిపక్షాలతో కలసి కాంగ్రెస్‌ చేసిన పోరాటం కారణంగానే వైదొలిగారని, దీనిపై సంతకం చేసి ఉంటే మరణశాసనం అయ్యే దన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన ఆజాద్‌ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, సీనియర్‌ నేత జానారెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా తదితరులతో కలసి మాట్లాడారు. ఆర్‌సెప్‌పై సంతకం చేసి ఉంటే చైనా వ్యాపారానికి భారత్‌ డంపింగ్‌ గ్రౌండ్‌గా మారేదన్నారు.   

నిరుద్యోగం, సాగు ఖర్చులు పెరిగాయి.. 
గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని ఎన్‌ఎస్‌ఎస్‌వో ఇచ్చిన నివేదిక లోక్‌సభ ఎన్ని కల ముందే వచ్చిందని, కానీ ఎన్నికల సమయంలో యువతను మోసం చేసేందుకు ఆ నివేదికను దాచిపెట్టారని ఆజాద్‌ విమర్శించారు. నిరుద్యోగం విషయంలో ప్రపంచ సగటు కన్నా భారత్‌లో రెండింతలు ఉందని చెప్పారు. దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని, వ్యవ సాయ అనుబంధ అంశాలైన ఫెర్టిలైజర్స్‌పై 5 శాతం, ట్రాక్టర్లపై 12 శాతం, పెస్టిసైడ్‌లపై 18 శాతం జీఎస్టీ విధించారని, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ ధరలు పెంచడంతో వ్యవసాయ ఖర్చులు రెండింతలు పెరిగాయన్నారు. సాగు ఖర్చులు పెరిగి కనీస మద్దతు ధర రాకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోక ఏమవుతారని ప్రశ్నించారు.   

అప్పటివరకు కశ్మీరీలకు ఆజాదీ లేనట్టే.. 
జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయని విలేకరులు ఆజాద్‌ను ప్రశ్నించగా.. ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీగా, మాజీ ముఖ్యమంత్రిగా తననే రాష్ట్రంలోకి వెళ్లేందుకు అనుమతించని పరిస్థితులున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కశ్మీర్‌ ప్రజలకు ఆజాదీ లేనట్టే అని అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య దారుణమన్న గులాంనబీ ఇలాంటి ఘటనలు అధికారాల్లో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top