పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాను

Not become a full-time politician says rajani kanth - Sakshi

అంతరాత్మను తెలుసుకునేందుకే ఆధ్యాత్మిక బాట: రజనీకాంత్‌

రిషీకేశ్‌: తానింకా పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాలేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్‌లో ఉన్న దయానంద సరస్వతి ఆశ్రమానికి మంగళవారం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన రాజకీయ అరంగేట్రంతో పాటు ఆధ్యాత్మిక అంశాలపై రజనీ మీడియాతో ముచ్చటించారు.

‘నేనింకా పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాలేదు. కనీసం పార్టీ పేరును కూడా నేను ప్రకటించలేదు. కాబట్టి ఇక్కడ (ఆశ్రమంలో) రాజకీయ వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు’ అని రజనీ చెప్పారు. ‘మనిషి జీవిత లక్ష్యం తనను తాను తెలుసుకోవడమే. నా అంతరాత్మ గురించి తెలుసుకునేందుకే నేను ఆధ్యాత్మిక బాట పట్టాను’ అని వెల్లడించారు.

తానిక్కడికి రావడం ఇదే తొలిసారి కాదనీ, గతంలోనూ చాలాసార్లు వచ్చినట్లు రజనీ స్పష్టం చేశారు. తమిళనాడులోని తేని జిల్లాలో 10 మంది ట్రెక్కర్లు సజీవదహనం కావడంపై విచారం వ్యక్తం చేసిన రజనీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. మంగళవారం దయానంద సరస్వతి ఆశ్రమానికి చేరుకున్న రజనీకాంత్‌తో ఫొటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top