విశ్వాస పరీక్ష.. దేశం మొత్తం చూస్తోంది

No-confidence Motion, PM Narendra Modi Tweeted - Sakshi

దాదాపు పదిహేనేళ్ల తర్వాత పార్లమెంట్‌లో విశ్వాసపరీక్ష అంశం తెరపైకి రావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐక్యత ప్రదర్శించేందుకు విపక్షాలు ఉవ్విళ్లూరుతుంటే.. మెజార్టీ(అంతకు మించే...) ఉందన్న ధీమాలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో కాసేపట్లోనే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలుకానుంది.

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో ఓ సందేశం ఉంచారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. అంతరాయం లేని.. నిర్మాణాత్మక చర్చకు సహచర ఎంపీలంతా సహకరిస్తారనే ఆశిస్తున్నా. ప్రజలకు.. రాజ్యాంగ రూపకర్తలకు మనం ఈ ప్రమాణం చేస్తున్నాం. దేశమంతా ఈ చర్చను పరిశీలిస్తోంది’ అని ప్రధాని.. ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు తీర్మానంపై చర్చ మొదలై సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. ఒకవేళ స్పీకర్‌ సమయాన్ని పొడిగిస్తే మాత్రం రాత్రి 9 గంటలకు వరకు సభ నిర్వహణ ఉండొచ్చు. అన్ని పార్టీల ఫ్లోర్‌ నేతలు మాట్లాడాక చివర్లో ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ చర్చ ఆలస్యం అయితే మాత్రం ఓటింగ్‌ను సోమవారానికి వాయిదా వేసే అవకాశం ఉంటుంది. (అవిశ్వాస తీర్మానాలు.. ఆసక్తికర అంశాలు)

మిశ్రమ స్పంద... అవిశ్వాసంపై తటస్థుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత కొంతకాలంగా మాటల తుటాలు పేలుస్తున్న శివసేన.. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలకు విప్‌ కూడా జారీ చేసింది. మరోవైపు కావేరీ పోరాటానికి ఏ పార్టీ మద్ధతు ఇవ్వలేదన్న కారణంతో అన్నాడీఎంకే.. అవిశ్వాసానికి మద్ధతు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్‌ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అటు బీజేడీ కూడా తన వ్యూహాన్ని పార్లమెంటులోనే ప్రకటిస్తానని తెలిపింది. 

ఎవరి ప్లాన్లు వాళ్లవి... వీలైనంత ఎక్కువ మెజార్టీ కోసం స్వయంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రంగంలోకి దిగారు. భాగస్వామ్య పక్షాలతోపాటు చిన్నా, చితకా పార్టీలతో నేరుగా మాట్లాడుతూ వచ్చారు. అటు విపక్షాలు కూడా.. తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అవిశ్వాస పరీక్ష అంకెల గారడీ కాదని.. మోదీ ప్రభుత్వానికి గెలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతున్నప్పటికీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ఈ అవిశ్వాసం పనికొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top