నేడే అవిశ్వాసం

Bjp No-confidence motion - Sakshi

మెజారిటీ కోసం బీజేపీ.. ఐక్యత కోసం విపక్షాల ప్రయత్నాలు

లోక్‌సభలో ఏడుగంటల పాటు చర్చ  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. గత పదిహేనేళ్లలో తొలిసారి జరగనున్న విశ్వాసపరీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీకి అవసరమైనంత మెజారిటీ ఉన్నప్పటికీ.. విపక్షాలు మాత్రం తమ ఐక్యతను ప్రదర్శించేందుకు సరైన వేదికగా భావిస్తున్నాయి. అటు అధికార పార్టీ బీజేపీ కూడా ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. లోక్‌సభలో విశ్వాసం నెగ్గేందుకు ప్రతి ఒక్క ఓటునూ జాగ్రత్తగా గమనిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటులో జరగనున్న అతిపెద్ద, కీలకమైన చర్చ ఇది కావడంతో విశ్వాస పరీక్ష చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం లోక్‌సభలో ఏడు గంటలపాటు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఒకవేళ చర్చ మరింత ఆలస్యమైతే.. ఓటింగ్‌ సోమవారానికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎవరి లెక్కలు వారివే..!
విశ్వాస పరీక్షలో నెగ్గటం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు.. తమ ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు వచ్చిన సీట్లకన్నా ఎక్కువ బలాన్ని (సంఖ్య) చూపించడం ద్వారా.. నరేంద్ర మోదీపై ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. అందుకే వీలైనంత ఎక్కువ సంఖ్యకోసం స్వయంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రంగంలోకి దిగారు. భాగస్వామ్య పక్షాలతోపాటు చిన్నా, చితకా పార్టీలతో నేరుగా మాట్లాడుతూ మద్దతు కూడగడుతున్నారు. అటు విపక్షాలు కూడా.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అవిశ్వాస పరీక్ష అంకెల గారడీ కాదని.. బీజేపీకి గెలిచేందుకు అవసరమైన ఎంపీల మద్దతున్నప్పటికీ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే తమ పని అని పేర్కొన్నాయి.

తటస్థులు ఎటువైపు?: అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలకు కలిపి 68 సీట్లున్నాయి. ఇది యూపీఏ పక్షాల మొత్తం సభ్యుల సంఖ్యతో సమానం. వీరంతా ఎటువైపుంటారనేదానిపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే, అన్నాడీఎంకే మాత్రం అవిశ్వాసానికి మద్దతుండదని.. గతంలో కావేరీ జలాలకోసం తాము చేసిన ఆందోళనలకు ఎవరి మద్దతూ లేనందున ఈసారి టీడీపీ అవిశ్వాసానికి అండగా నిలవబోమని స్పష్టం చేసింది. అటు, టీఆర్‌ఎస్‌ దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్‌ కూటమితో కలిసేందుకు కేసీఆర్‌ అయిష్టంగానే ఉన్నారు. అటు బీజేడీ కూడా తన వ్యూహాన్ని పార్లమెంటులోనే ప్రకటిస్తానని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌లతో సమదూరాన్ని కొనసాగిస్తామని నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.

మోదీ వర్సెస్‌ రాహుల్‌
విశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన సమయంలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ లోక్‌సభా పక్షనేత మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్‌నేత జ్యోతిరాదిత్య సింధియాలు మాట్లాడే అవకాశం ఉంది. తన ప్రసంగంలో మోదీ ప్రభుత్వంపైనే రాహుల్‌ గాంధీ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో మోదీ, రాహుల్‌ మధ్య జరుగుతున్న ట్వీట్‌ల వాగ్యుద్ధం నేపథ్యంలో శుక్రవారం కూడా రాహుల్‌ వాడివేడి విమర్శనాస్త్రాలు సంధించే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. బ్యాంకు మోసాలు, వ్యవసాయ సంక్షోభం, కశ్మీర్, మూక దాడులు, నిరుద్యోగం, మహిళల భద్రత తదితర అంశాలపై రాహుల్‌ ప్రసంగం ఉండనుందని సమాచారం. ఖర్గే, సింధియాలు కూడా ఒక్కో అంశంపై కేంద్రాన్ని టార్గెట్‌ చేయనున్నారు.  శుక్రవారం సభలో ఆనుసరించాల్సిన వ్యూహంపై యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మిగతా కాంగ్రెస్‌ నేతలతో విస్తృతంగా చర్చించారు.  

ముచ్చటగా మూడోసారి..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవడం ఇది మూడోసారి. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో ఓసారి , 2003లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. 1999లో జరిగిన విశ్వాస పరీక్షలో అప్పటివరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న బీఎస్పీ లోక్‌సభలో వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది.

అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన రక్షణమంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు 2003లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా 312, వ్యతిరేకంగా 186 ఓట్లు రావడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ఈ ఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అవిశ్వాస తీర్మానం గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. లోక్‌సభలో 198వ నిబంధన ప్రకారం సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇందుకోసం కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం.

త్రీలైన్‌ విప్‌ జారీ
నేడు అవిశ్వాస తీర్మానం సందర్భంగా కొన్ని పార్టీలు తమ లోక్‌సభ సభ్యులకు త్రీలైన్‌ విప్‌ను జారీచేశాయి. ఒకవేళ ఏ పార్లమెంటు సభ్యుడయినా ఈ విప్‌కు అనుగుణంగా ఓటేయకపోతే అతన్ని పార్టీల ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హుడిగా పరిగణిస్తారు. సభ్యులకు జారీచేసే విప్‌ నోటీసులో విషయ తీవ్రతను బట్టి అందులోని అంశాన్ని మూడుసార్లు అండర్‌లైన్‌ చేస్తే దాన్ని త్రీలైన్‌ విప్‌గా పరిగణిస్తారు.

ఇప్పటివరకూ ప్రధానులపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు
ఇందిరాగాంధీ           15 సార్లు
లాల్‌బహదూర్‌ శాస్త్రి    3 సార్లు
పీవీ నరసింహారావు    3 సార్లు
మొరార్జీ దేశాయ్‌        2 సార్లు
వాజ్‌పేయి                2 సార్లు
జవహర్‌లాల్‌ నెహ్రూ    ఒక సారి

సోషలిస్ట్‌ నేత ఆచార్య కృపలానీ దేశంలోనే తొలిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా చేతిలో ఘోర పరాజయం అనంతరం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1963, ఆగస్టులో లోక్‌సభలో ఆయన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top