మనది ఒంటరి పోరే

 Narendra Modi's slogan for Elections 2019 - Sakshi

తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని మోదీ, షా

రాష్ట్రంలో పార్టీని సమాయత్తం చేయండి

ప్రచారానికి వస్తా.. మోదీ హామీ

పార్టీ బలోపేతానికి సాయం

టీఆర్‌ఎస్‌పై పోరులో వెనుకంజ వేయవద్దని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది ఒంటరి పోరే అని, ఆ దిశగా పార్టీని సమాయత్తం చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిసిన తర్వాత.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను పిలిచించి మోదీ, షా మాట్లాడారు. ‘‘వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ బీజేపీది ఒంటరి పోరే. ఇందుకోసం పార్టీ కేడర్‌ను సిద్ధం చేయండి. అందుకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను మేం అందిస్తాం’’అని మోదీ, షా చెప్పినట్లు తెలిసింది.

పాలమూరులో 15న జరిగే బహిరంగ సభ ద్వారా ఎన్నికల పోరును ఉధృతం చేయాల్సిందిగా సూచించారు. బహిరంగ సభల్లో తాను కూడా పాల్గొం టానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. టీఆర్‌ఎస్‌పై పోరులో వెనుకంజ వేయవద్దని, తెలంగాణలో అధికారం సాధించేదిశలో పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడే వరకు 50 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, దీనికి తాను, అమిత్‌ షా సహా కేంద్రమంత్రులం హాజరవుతామని మోదీ చెప్పినట్టు సమాచారం.

ముందు ఎమ్మెల్యేగా గెలిచిరండి
ఇటీవల పార్టీలో చేరుతున్న కొంత మంది నేతలు ఎంపీ స్థానాల్లో పోటీకి ఉత్సాహం చూపుతుండటంతో.. వారికి అమిత్‌ షా కొన్ని షరతులు విధించినట్టు తెలిసింది. ఎంపీగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి తమ సత్తా నిరూపించుకుని రావాల్సిందిగా ఆదేశాలిచ్చిన్నట్టు సమాచారం.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టిక్కెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఎంపీ టికెట్ల ఆశావహుల కోసం ఈ షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రచారం ముమ్మరం చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలందాయి. ఎన్నికల పోటీ టీఆర్‌ఎస్‌కు బీజేపీకి మధ్య అనేంతలా ప్రచారం జరగాలని, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీలకు ఓట్లు వేస్తే ఎన్నికల తర్వాత గెలిచే ఆ పార్టీ నేతలు తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకుంటారన్న ప్రచారం చేయాలని సూచనలందాయి.

ఓటర్ల నమోదుకు 2019 ప్రాతిపదిక చేయాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. పాత షెడ్యూల్‌ ప్రకారం కొత్త ఓటర్ల నమోదుకు 2019 జనవరి 1ని ప్రాతిపదికగా చేయాలని కోరారు. 2018 జవనరి 1ని ప్రాతిపదిక చేస్తే లక్షలాది మంది కొత్త ఓటర్లు  ఓటు హక్కును కోల్పోతారని, ఈ విషయమై ఈ నెల 11న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని తెలిపారు.

హామీలను అమలు చేయడంలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమవ్వడంతో ఓట్లు వ్యతిరేకంగా పడతా యనే భయం కేసీఆర్‌లో ఉందన్నారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కాబట్టి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పిన కేసీఆర్‌.. ఎన్నికల తర్వాత కూడా విమర్శలు చేస్తే ఎన్నికలకు వెళ్తారా.. అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. దివంగత ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్‌తో పొత్తుకు ఏపీ సీఎం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top