గాంధీ కోటకు ప్రధాని మోదీ

Narendra Modi Visiting Amethi On Sunday After 2014 - Sakshi

ఆదివారం అమేథిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

2014 తరువాత తొలిసారి పర్యటన

లక్నో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకో రాష్ట్రం చొప్పున దేశమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌పై మోదీ ప్రత్యేక దృష్టిసారించారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన మోదీ ఆదివారం అమేథిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తరువాత తొలిసారి అడుగుపెట్టనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. కుహ్వారా ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. మోదీ సభకు ఏర్పాట్లను యూపీ సీఎం యోగి  ఆదిత్యానాధ్‌ పరిశీలించారు. సభకు లక్షకు పైగా కార్యకర్తలు హాజరవుతారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి.

దశాబ్దాలుగా గాంధీ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిపై బీజేపీ ప్రత్యేక దృష్టిని సారించింది. దానిలో భాగంగానే బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ స్మృతి ఇరానీని గత ఎన్నికల్లో రాహుల్‌పై పోటీకి నిలిపింది. స్వల్ప ఓట్ల తేడాతో ఆమెపై రాహుల్‌ విజయం సాధించారు. ఈసారి ఎలానైనా విజయం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. యూపీలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో గత ఎన్నికల్లో ఓటమి చెందిన స్థానాలపై బీజేపీ మరింత దృష్టి సారించింది. దానిలో భాగంగానే యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రామబరేలిలో గత ఏడాది మోదీ పర్యటించారు. మోదీ చివరిసారిగా 2014 మే 4న ఆమేథిలో పర్యటించిన విషయం తెలిసిందే.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top