‘నారా హమారా.. టీడీపీ హమారా’  కేసు వాయిదా 

Nara Hamara TDP Hamara Case Postponed - Sakshi

హైదరాబాద్‌: రెండు నెలల క్రితం గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’బహిరంగ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముస్లిం యువకులపై దాడిచేసి అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ రెహమాన్‌ దాఖలు చేసిన ఫిర్యాదు విచారణ డిసెంబరు 17వ తేదీకి వాయిదా పడింది.

ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ నంద్యాలకు చెందిన ముస్లిం యువకులు ఆ బహిరంగసభలో శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చితకబాదారు. అంతటితో ఆగకుండా అక్రమ కేసులు బనాయించారు. ఈ ఘటనను సవాలు చేస్తూ ఆగస్టు 31న మానవ హక్కుల కమిషన్‌లో రెహమాన్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై, వారిని ప్రేరేపించిన సీఎం చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ అక్టోబరు 22కి వాయిదా వేస్తూ సమగ్ర నివేదిక ను అందజేయాలంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీకి నోటీసులు జారీచేసింది. అయితే.. సోమ వారం గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం నుంచి ఎవరూ హాజరుకాలేదని రెహమాన్‌ తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top