కాంగ్రెస్‌ సిట్టింగ్‌.. 'కారు' పార్కింగ్‌!

Nagarkurnool Constituency Review - Sakshi

వెనుకబాటుకు చిరునామా.. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం

భారీ మెజార్టీతో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ యత్నం

కాంగ్రెస్‌లో కొలిక్కి రాని అభ్యర్థి ఎంపిక..‘స్థానికత’పై రగడ

వలసలు, వెనుకబాటుకు చిరునామాగా మారిన నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 1967లోఏర్పడింది. ఈ పార్లమెంట్‌నియోజకవర్గానికి 12 మార్లు ఎన్నికలు జరగగా ఇందులో ఏడుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌) గెలుపొందాయి. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, ఆలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి.  మొత్తంగా 15.88 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి వెనుకబడిన నియోజకవర్గమైన ఈ ప్రాంతంలో జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. సాగునీరే ప్రధాన ఎజెండాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్‌ స్థానం తప్ప మిగిలిన ఆరు స్థానాలను భారీ మెజార్టీతో దక్కించుకుంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుచుకున్న ఈ స్థానాన్ని ఈసారి వదులుకోరాదనే పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌.. పార్టీ సీనియర్‌ నేత పి.రాములును బరిలో నిలపనుంది! ఇక కాంగ్రెస్‌ నుంచి నంది ఎల్లయ్యను కాకుండా మరో నేతలను బరిలో దించేలా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. బీజేపీ సైతం  అభ్యర్థి వేటలో పడింది....::: సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి

మెజార్టీ దిశగా ‘కారు’..
నాగర్‌కర్నూల్‌ నుంచి టీడీపీ తరఫున మూడుసార్లు, కాంగ్రెస్‌ తరఫున ఒకసారి మంద జగన్నాథం గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గత ఎన్నికల్లో నంది ఎల్లయ్యపై 17,800 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా మందకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవిని కట్టబెట్టారు. అయితే ఈసారి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన మంద జగన్నాథాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే పి.రాములును టీఆర్‌ఎస్‌ బరిలో నిలుపుతోంది. సౌమ్యుడిగా పేరున్న రాములుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన పేరు ప్రకటన ఖాయంగా కనిపిస్తోంది. నాగరకర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఇటీవల అసెంబ్లీ వారీగా వచ్చిన మెజార్టీని లెక్కిస్తే దాదాపు 1.75 లక్షల ఓట్ల మెజార్టీ టీఆర్‌ఎస్‌కు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మెజార్టీని డబుల్‌ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అనుబంధంగా ఉన్న అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. ఇవన్నీ కూడా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు కలిసొస్తాయన్న భావన టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేని కొల్లాపూర్‌లోనూ పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీని ఇచ్చే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పావులు కదుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో భారీ మెజార్టీ వచ్చేలా ప్రణాళిక రచన చేస్తున్నారు. కాగా ఇటీవలే నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశాన్ని వనపర్తిలో నిర్వహించగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

కాంగ్రెస్‌లో ‘లోకల్‌’ కుంపటి
తెలంగాణ హవా కొనసాగిన 2014 ఎన్నికల్లోనూ నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకోగలిగింది. స్థానికేతరుడైన నంది ఎల్లయ్యను బరిలో నిలిపినా, గెలుపు బాధ్యతలు తనపై ఎత్తుకున్న మాజీ మంత్రి డీకే అరుణ ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో నంది ఎల్లయ్య 17,800 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాంగ్రెస్‌ కీలక నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక మొత్తంగా ఏడు నియోజకవర్గ అసెంబీల్లో కేవలం కొల్లాపూర్‌ నుంచి హర్షవర్ధన్‌రెడ్డి ఒక్కరే కాంగ్రెస్‌ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మిగతా ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రచారపర్వంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌లో ఇంకా టికెట్ల పంచాయితీ కొలిక్కి రాలేదు. నాగర్‌కర్నూల్‌ స్థానానికి ఇప్పటివరకు స్థానికేతరులనే ఎంపిక చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లోనైనా స్థానికులకు టికెట్‌ కేటాయించాలనే డిమాండ్‌ ఊపందుకుంది. ఒకవైపు పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థుల కోసం హైకమాండ్‌ కసరత్తు చేస్తోంటే మరోవైపు నేతలు లోకల్‌ కుంపటిని రాజేస్తున్నారు. అదీగాక టిక్కెట్‌ను ఎవరికి కేటాయించాలన్న దానిపై నేతల్లో స్పష్టత లేదు. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ టికెట్‌ కోసం పోటీ పడుతుండగా, డీకే అరుణ.. సతీష్‌మాదిగ పేరును ప్రతిపాదిస్తున్నారు. అయితే సిట్టింగ్‌గా ఉన్న నంది ఎల్లయ్యకే ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. లేనిపక్షంలో గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసిన మల్లు రవి లేదా సంపత్‌కుమార్‌కు కేటాయించే అవకాశాలున్నాయి.


‘సెంటిమెంట్‌’నుసెట్‌ చేసినకేసీఆర్‌

ఎన్నికల సమయంలో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్రచారమంటేనే ప్రధాన పార్టీల నేతలు బెంబేలెత్తే పరిస్థితి ఉండేది. ఇక్కడికి ప్రచారానికి వస్తే అధికారానికి దూరమవుతారనే ‘సెంటిమెంటే’ దీనికి కారణం. ముప్పై ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సెంటిమెంట్‌ను కేసీఆర్‌ తిరగరాశారు. 1989లో నాగర్‌కర్నూల్‌లోని ఓ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి రాజీవ్‌గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రధాని పదవి కోల్పోయారు.  ఇక, కాంగ్రెస్‌ పార్టీ తరఫున నటుడు కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి, అదే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్టీఆర్‌ సైతం 1989 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం నిర్వహించి తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కూడా నాగర్‌కర్నూల్‌లో అడుగుపెట్టలేదని అంటారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తానికి సీఎం కేసీఆర్‌ నాగర్‌కర్నూల్‌లో ప్రచారం చేసి టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో ఆ సెంటిమెంట్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌ రెడ్డి 54,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అదే ఊపుతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది.

బీజేపీప్రభావం అంతంతే..
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఒక్క కల్వకుర్తి పరిధిలో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగిన బీజేపీ.. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కేవలం ఉనికిని చాటుకోవడానికే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దృష్ట్యానే ఆ పార్టీ తరఫున అభ్యర్థుల నుంచి పెద్దగా పోటీ సైతం కనిపించడం లేదు. దళిత మోర్చా మహిళా నేత బంగారు శ్రుతి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఎన్నికల్లో ప్రభావం చూపేఅంశాలు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోభాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు
శ్రీశైలం ముంపు బాధితులకు ఉద్యోగాలు
గట్టు ఎత్తిపోతల, తుమ్మిళ్ల రెండో ఫేజ్‌ పనులుమరింత వేగం పుంజుకోవాల్సి ఉంది
సోమశిల బ్రిడ్జి నిర్మాణం
ఆలంపూర్‌ దేవాలయ అభివృధ్ధి, బస్సు డిపో ఏర్పాటు
గద్వాల–మాచర్ల రైల్వేలేన్‌ పనులు.. చెంచులకు ఇళ్ల నిర్మాణం

లోక్‌సభ ఓటర్లు
పురుషులు    7,99,182
మహిళలు    7,89,529
ఇతరులు     35
మొత్తం      15,88,746

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top