ముషర్రఫ్‌ కూటమికి స్పందన కరువు

Musharraf Alliance Fails on Second Day - Sakshi

ఇస్లామాబాద్ : ఎలాగైనా తిరిగి అధికారంలోకి వద్దామని భారీ వ్యూహరచన చేసిన మాజీ సర్వసైన్యాధ్యక్షుడు పర్వేజ్‌ ముషర్రఫ్‌కు ఊహించని ఝలక్‌. ఆయన కొత్తగా ప్రకటించిన అవామీ ఇత్తెహాద్‌ కూటమిలో చేరేందుకు పలు కీలక పార్టీలు విముఖత వ్యక్తంచేశాయి.

షరీఫ్‌ పార్టీ ముస్లిం లీగ్‌ను ఎదుర్కునేందుకు ముషారఫ్ శనివారం ‘పాకిస్థాన్‌ అవామీ ఇత్తెహాద్‌’ మహా కూటమిని ఏర్పాటు చేశారు. పీఐఏకు 74 ఏళ్ల ముషర్రఫ్‌ సారథ్యం వహిస్తుండగా.. ఇక్బాల్ దార్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు పార్టీలకు విజ్ఞప్తి చేశారు కూడా. పాకిస్థాన్ తెహ్రీక్-ఐ-ఇన్సాఫ్ (పీటీఐ) , ముత్తాహితా క్వామి మూమెంట్ (ఎంక్యూఎం), పాక్ సర్జామీన్ పార్టీ (పీఎస్‌పీ), మజ్లిస్‌ వహెదత్‌-ఈ-ముస్లిమీన్‌(ఎండబ్ల్యూఎం), సున్ని ఇత్తెహద్‌ కౌన్సిల్‌(ఎస్‌ఐసీ) ఇలా 23 పార్టీలను తమతో చేతులు కలపాల్సిందిగా ముషర్రఫ్‌ కోరారు.  

అయితే ఆయా పార్టీలు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ముఖ్యంగా బలమైన ప్రతిపక్షమైన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ ఈ విషయంలో ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, పంజాబ్‌ బహిరంగ సభలో ఇమ్రాన్‌ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే త్వరగతిన ఎన్నికలు జరగాలని... ఆ పోరాటంలో స్వచ్ఛరాజకీయాలకే తాము ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో మిగతా పార్టీలు కూడా వెనకంజ వేశాయన్నది స్పష్టమౌతోంది. ఏది ఏమైతేనేం ముషర్రఫ్‌ మహాకూటమి ఘోరంగా విఫలమైందని రెండో రోజే రాజకీయ విశ్లేషకులు నిర్ధారించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top