శ్రీమంతుడి సవతి ప్రేమ

MP Galla Jayadev Adopted Villages Review - Sakshi

రెండు గ్రామాలను దత్తత తీసుకున్న ఎంపీ గల్లా జయదేవ్‌

అనంతవరప్పాడు బీసీ కాలనీలో రోడ్లు వేయని వైనం

శ్మశాన స్థలం లేక పొలం గట్లపై అంత్యక్రియలు చేస్తున్న ఎస్సీలు

ఎస్టీలకు సొంతిల్లు ఎండమావే బేతపూడిలోనూ ఇదే పరిస్థితి

‘అనంతవరప్పాడు గ్రామాభివృద్ధి చరిత్రలో ఓ నూతన అధ్యాయం. రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఎంపీ గల్లా జయదేవ్‌ రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా చేశారు..’ ఇదీ ఎంపీ గల్లా జయదేవ్‌ దత్తత తీసుకున్న వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామాభివృద్ధిపై సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ‘సాక్షి’ ఆ గ్రామానికి వెళ్లగా పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. గ్రామస్తులను పలకరించగా.. బీసీలు నివసించే కాలనీలో సీసీ రోడ్లు,డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. శ్మశానం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీలు, ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు కట్టలేదని ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామ జనాభా సుమారు 5 వేలు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఈ గ్రామాన్ని 2014లో ‘సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన’ కింద దత్తత తీసుకున్నారు.  ‘శ్రీమంతుడు’ సినిమా తరహాలో తమ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశపడ్డారు. ఐదేళ్లు గడిచిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు.  గ్రామంలోని బీసీ కాలనీలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. పలుచోట్ల సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా.. బీసీ కాలనీలో మాత్రం ఇవేమీ చేయలేదు. వీటి నిర్మాణానికి ఎంపీ గల్లా శంకుస్థాపన చేసినా పనులు చేపట్టలేదు. వీళ్లంతా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులనే అక్కసుతోనే పట్టించుకోలేదని బీసీ కాలనీ వాసులు వాపోతున్నారు. ఎస్సీ కాలనీ నిర్లక్ష్యానికి గురైంది. ఎస్టీలు దుర్భర స్థితిలో బతుకీడుస్తున్నారు.

ఊరి బయలే గుడారాలు
అనంతవరప్పాడులో సుమారు 50 వరకూ ఎస్టీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కనీస అవసరాలు తీరే పరిస్థితి లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలో ఎస్టీలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టిస్తామని ఎంపీ వాగ్దానం చేశారు. ఆ హామీ నెరవేరకపోవటంతో ఎస్టీ కుటుంబాలు నేటికీ ఊరిబయట గుడారాల్లోనే బతుకీడుస్తున్నాయి. ఆ ప్రాంతానికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు.

అభివృద్ధికి ఆమడ దూరం
గ్రామంలోని ఎస్సీ కాలనీలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించటం లేదు. ఎస్సీల్లో ఎవరైనా మరణిస్తే.. మృతదేహాన్ని ఖననం చేయడానికి కూడా దిక్కులేదు. శ్మశానం కోసం స్థలం కేటాయించాలని ఎంపీ గల్లా జయదేవ్‌ దృష్టికి తీసుకువెళ్లగా.. పట్టించుకోలేదని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజున పాఠశాలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన ఎంపీ ఈ ఊసే మర్చిపోయారని వాపోయారు.

బేతపూడిలోనూ అదే దుస్థితి
ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామాన్ని 2017 జనవరిలో ఎంపీ దత్తత తీసుకున్నారు. కానీ.. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. 5,700 జనాభా ఉన్న బేతపూడిలో 3,025 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నిర్మించినా.. అది అలంకార ప్రాయంగానే మారింది. ఇప్పటికీ అందులో నీరు నింపలేదు. చైతన్య నగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వైఎస్సార్‌ హయాంలో వేసిన ఒక్క సీసీ రోడ్డు మాత్రమే ఉంది. ఆ తరువాత ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదు. 300 మంది ఓటర్లున్న చైతన్యనగర్‌లో ఎక్కువ భాగం వైఎస్సార్‌ సీపీ అభిమానులు ఉన్నందునే పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

చుట్టపు చూపుగా అయినా రాలేదు
ఎంపీ జయదేవ్‌ దత్తత తీసుకున్న గ్రామాలకు చుట్టపు చూపుగా కూడా వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. నాలుగైదుసార్లు కూడా గ్రామాలకు పోలేదంటే అతిశయోక్తి కాదు. దత్తత గ్రామాలను విస్మరించిన ఎంపీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు ఎలా వస్తారో చూస్తామని, ఓటుతోనే సమాధానం చెబుతామని అక్కడి ఓటర్లు అంటున్నారు.  

 వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులమనే..
మా కాలనీలో నివసిస్తున్న వారంతా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులనే ఇక్కడ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించకుండా ఆపేశారు. ఎంపీ దత్తత తీసుకున్నా మా సమస్యలు తీరలేదు.  –బి.రామ్మూర్తి, బీసీ కాలనీ వాసి, అనంతవరప్పాడు

పొలం గట్లను ఆశ్రయిస్తున్నాం
నాలుగేళ్ల క్రితం ఎంపీ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎస్సీలకు శ్మశాన వాటిక స్థలం కావాలని కోరాం. నేటికీ మంజూరు చేయలేదు. ఎవరైనా మరణిస్తే పొలం గట్లమీద ఖననం చేస్తున్నాం. మండల పరిషత్‌ పాఠశాలనూ అభివృద్ధి చేయలేదు.– కొమ్మనూరి లక్ష్మణరావు,ఎస్సీ కాలనీ వాసి, అనంతవరప్పాడు

చిన్నచూపు చూస్తున్నారు
ఎంపీ దత్తత తీసుకున్న గ్రామం అయినా అభివృద్ధికి నోచుకోలేదు. వైఎస్సార్‌ సీపీ అభిమానులమని మా కాలనీల్లో రోడ్లు వేయలేదు. మా సమస్యల్ని గ్రామదర్శినిలో అధికారులకు చెప్పుకోడానికి వెళితే అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఎస్సీలంటే చిన్నచూపు చూస్తున్నారు. తగిన గుణపాఠం చెబుతాం.         – జి.ఏడుకొండలు, ఎస్సీ కాలనీ, అనంతవరప్పాడు

తాగునీటి సమస్యతో సతమతం
బేతపూడిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పట్టించుకునే నాథుడే లేడు. కొత్తగా నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ అలంకార ప్రాయంగా మారింది. ఎంపీ దత్తత తీసుకుంటే గ్రామంలో సమస్యలు తీరతాయని ఆశపడ్డాం. కానీ ఏం లాభం లేదు.      – షేక్‌ ఖాజావలి, బేతపూడి

ఎన్నికలప్పుడే గుర్తొస్తాం
ఎన్నికలొస్తేనే నాయకులకు మేం గుర్తొస్తాం. మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న ఎంపీ కనీసం అప్పుడప్పుడైనా వచ్చిన పాపాన పోలేదు. రోడ్లు, డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ మాత్రం అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకోవడం ఎందుకు. పత్రికల్లో ప్రచారం చేసుకోవడం తప్ప.     – షేక్‌జాకీర్, బేతపూడి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top