చంద్రబాబు దుర్మార్గుడు | Motkupalli Narasimhulu slams on congress | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దుర్మార్గుడు

Nov 2 2018 4:32 AM | Updated on Nov 2 2018 4:32 AM

Motkupalli Narasimhulu slams on congress - Sakshi

రాజాపేట: తెలంగాణలో కేసీఆర్‌ను, ఆంధ్రాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను ఉరితీస్తే చిరకాలం తానే ముఖ్యమంత్రిగా ఉండవచ్చని అనుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి, ఆలేరు బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత స్వార్థం కోసం ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను బొందపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయాడని అన్నారు. ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తప్పకుండా ఓడించి తీరుతారని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ఒకప్పుడు సీట్లు ఇచ్చే టీడీపీ.. ప్రస్తుతం కాంగ్రెస్‌ వద్ద సీట్ల కోసం అడుక్కుంటోందని, టీడీపీలో మోత్కుపల్లి అనేవాడు ఒక్కడు ఉంటే అధికారంలోకి తీసుకొచ్చిపెట్టే వాడని అన్నారు. తన స్వార్థం కోసం ఎవరికైనా, ఎదైనా చెడు చేసే దుర్మార్గుడు చంద్రబాబని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement