కాంగ్రెస్‌ వల్లే చొరబాట్లు

Modi blames Cong for infiltration problems in Assam, rest of Northeast - Sakshi

ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రధాని మోదీ ధ్వజం

అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి

అస్సాం, అరుణాచల్‌లలో ప్రచారం

గోహ్‌పూర్‌/ఆలో: గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగానే అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు అక్రమ చొరబాట్లతో ఇబ్బందులు పడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన విజయాలు, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. శనివారం ఆయన అస్సాంలోని గోహ్‌పూర్, అరుణాచల్‌లోని ఆలో సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో అసోం ఏవిధంగా నిర్లక్ష్యానికి గురైందీ పెద్దవారిని అడిగి తెలుసుకోవాలని ప్రధాని యువతను కోరారు.

‘దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్‌కు అసోం ప్రజలు మద్దతిస్తారా? దేశం అభివృద్ధిని కాంక్షించని ఆ పార్టీ అస్సాం అభివృద్ధిని పట్టించుకుంటుందా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే ఉంది. కానీ, ఈ చౌకీదార్‌(మోదీ) చొరబాట్లు, ఉగ్రవాదం, అవినీతిపై పోరాటం సాగిస్తున్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి మద్దతివ్వండి’ అని ప్రధాని ప్రజలను కోరారు. అనంతరం ఆయన అరుణాచల్‌లోని ఆలోలో మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటూ సరిహద్దులను కాపాడుతున్న ఇక్కడి ప్రజల వల్లనే అరుణాచల్‌ దేశానికి రక్షణ కవచంగా మారిందన్నారు.

‘దేశం గణనీయమైన విజయాలు సాధించినప్పుడు, మీరు సంతోషపడరా? దేశ విజయాలను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడటం సహజం. కానీ కొందరు మాత్రం, దేశం సాధించిన ప్రగతి, విజయాలకు బాధపడతారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోనే హతమార్చినప్పుడు ప్రతిపక్షాలు ఎలా వ్యవహరించాయో మీరు చూశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయాలను కూడా వారు చులకన చేశారు. అలాంటి ప్రతిపక్ష పార్టీలను వచ్చే ఎన్నికల్లో మీరే శిక్షించాలి’ అని ప్రజలను కోరారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌ పార్టీ..దేశ ప్రజల ప్రయోజనాలతో చెలగాటమాడుకుందని విమర్శించారు.

దాదాపు 55 ఏళ్ల కాంగ్రెస్‌ రాచరిక పాలనలో రాష్ట్రాభివృద్ధి సుదూర స్వప్నంగా మిగిలిపోయిందని ఆరోపించారు. ‘మీ వల్లనే ఈశాన్య భారతాన మొదటగా అరుణాచల్‌లోనే కమలం వికసించింది. రాష్ట్రంలోని 50వేల కుటుంబాలకు విద్యుత్, 40 వేల కుటుంబాలకు వంట గ్యాస్‌ సౌకర్యం కల్పించడంతోపాటు ఒక లక్ష కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 7 దశాబ్దాల తర్వాత మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి రైలు సౌకర్యం కల్పించింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఈశాన్య ప్రాంతానికి గణనీయంగా నిధులు వెచ్చించాం’ అని వివరించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top