
తాడితోట(రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆదివారం తన పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌రావుకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపించారు. సోమవారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. సినీ నటుడు పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరేందుకే పదవులకు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించడంలో బీజేపీ అధినాయకత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడంలో, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీంతో మనస్తాపానికి గురై బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.