ఎమ్మార్వో హత్య: ఆరోపణలు కొట్టిపారేసిన మంచిరెడ్డి

MLA Manchireddy kishan Reddy Respond On Tahsildar Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్‌ఎస్‌ కార్యక​ర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్‌రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు.

విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్‌ భూములు కొనుగోలు చేసింది మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్‌ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు.

ఆ భూమి విలువ రూ. 100 కోట్లు
నాలుగు సర్వేల్లో ఉన్న భూమి  విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్  గత ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top