ఇంకా అజ్ఞాతంలోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు!

MLA Anand Singh Definitely Vote For Us, Says Congress - Sakshi

సాక్షి, బెంగళూరు : ఓవైపు బలపరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌, ప్రతాప్‌ గౌడ ఇంకా హాజరు కాలేదు. గత రెండు రోజులుగా వీరిద్దరు అందుబాటులో లేని విషయం తెలిసిందే.  కాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి శనివారం ఉదయం ఇక్కడ మాట్లాడుతూ... ఆనంద్‌ సింగ్‌ విధాన సభకు వస్తారని, ఆయన కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అంతకు ముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

బలపరీక్షపై ఆయన మాట్లాడుతూ... సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస‍్తవమో కాంగ్రెస్‌ నెగ్గడం అంతే నిజమన్నారు. యడ్యూరప్ప ముందుగానే రాజీనామా చేస్తే మంచిదని సూచించారు. 117 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకు ఉందన్నారు. యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా మొదటి తప్పు చేశారని, ఇక ప్రోటెం స్పీకర్‌ ఎంపిక విషయంలో రెండో తప్పు చేశారని రామలింగారెడ్డి విమర్శించారు.

మస్కి ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు

రెండు రోజులుగా తమకు అందుబాటులో లేకుండాపోయిన మస్కి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతాప్‌ గౌడ తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం సాయంత్రంలోపు విధానసభలో బలనిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యే ప్రతాప్‌ గౌడను తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి వసంతకుమార్‌...ఎమ్మెల్యే ప్రతాప్‌ గౌడతో ఫోన్‌తో సంభాషించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేతల సూచనల మేరకు ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top