కేసీఆర్‌తో స్టాలిన్‌ భేటీ రద్దు!

MK Stalin May Not Meet KCR On May 13 - Sakshi

చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో తమ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ భేటీ కాకపోవచ్చని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని తెలిపాయి. పూర్తి వివరాలు వెల్లడించేందుకు డీఎంకే వర్గాలు నిరాకరించాయి.

చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని పేర్కొంది. తాజాగా డీఎంకే పార్టీ వర్గాల ప్రకటనతో భేటీపై సందిగ్ధం నెలకొంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడం​ ఇష్టం లేకే కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ విముఖత చూపారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏప్రిల్‌ 18న తమిళనాడులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో డీఎంకే జట్టు కట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్‌తోనే ముందుకు సాగాలన్న భావనతో డీఎంకే ఉన్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన కేసీఆర్‌తో చర్చలు జరిపితే తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ సీఎంతో భేటీకి దూరంగా ఉండాలని స్టాలిన్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, కేసీఆర్‌ సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే గుణాత్మక మార్పు సాధ్యమని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు. మరోవైపు కర్ణాటక​ ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top