చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

Mekapati Goutham Reddy Slams On Chandrababu Naidu - Sakshi

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఐదేళ్లలో రూ.38.83 కోట్లు వ్యయం చేశారన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

రాష్ట్రప్రతిష్ట పెంచడానికి విదేశీ పర్యటనలు: చంద్రబాబు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఉండగా గత ఐదేళ్లలో చంద్రబాబు విదేశీ టూర్లకు వెళ్లడం, దానిపై రూ. కోట్లు  వ్యయం చేయడంపై సోమవారం అసెంబ్లీలో రభస జరిగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే పలువురు అధికార పార్టీ సభ్యులు స్పందిస్తూ.. విదేశీ పర్యటనల పేరుతో విలాసాలకు ఖర్చు చేసిన వ్యయానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంత మేలు జరిగిందో చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

సీఎంగా చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుపై విచారణ జరిపిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. సభ ప్రారంభం కాగానే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు రూ.38.83 కోట్లు వ్యయం చేశారని చెప్పారు. పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ల పేరుతో దావోస్‌ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వెనుక గుట్టు ఏమిటో తెలియాలంటే కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు.
 
రాత్రి 11 వరకూ కష్టపడ్డా...
మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పెట్టుబడుల కోసమే కష్టపడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్ట పెరగడానికే విదేశీ పర్యటనలకు వెళ్లానని, ప్రధాని దేశాలు తిరగడం లేదా అని ప్రశ్నించారు. కావాలనే నాపై బురదజల్లుతున్నారని చెప్పారు.
 
చంద్రబాబు హయాంలో 16 ఒప్పందాలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు విదేశీ పర్యటనలంటూ చేసిన వ్యయంపై విచారణ జరిపిస్తామని, దీనిపై ఇప్పటికే సబ్‌ కమిటీ వేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2014 జూన్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకూ సీఎం, మంత్రులు, అధికారులు, కన్సల్టెంట్లు విదేశీ పర్యటనల కోసం రూ.38,83,10,772 వ్యయం చేశారని, 16 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారన్నారు. వీటిన్నిటిపైనా సమగ్రంగా విచారణ జరిపిస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గత ఐదేళ్లలో 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని, చంద్రబాబులా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగలేదని చెప్పారు. విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీచేశారని మండిపడ్డారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top