వారితో సంక్షోభం... మాతో సంక్షేమం

Medak district bjp leaders join in trs - Sakshi

ఆ నాలుగు పార్టీలకు రాద్ధాంతాలు తప్ప సిద్ధాంతాలు లేవు

చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు

కోదండరాం తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని మంటగలిపారు

సాగునీటి మంత్రి తన్నీరు హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌లో చేరిన ఉమ్మడి మెదక్‌ జిల్లా బీజేపీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: కూటమికి ఓటేస్తే రాష్ట్రంలో సంక్షోభం వస్తుందని... టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే సంక్షేమం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కూటమిలోని పార్టీలకు రాద్ధాంతాలు తప్ప సిద్ధాం తాలు ఏమీ లేవని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి హరీశ్‌ మాట్లాడారు.

‘తెలంగాణలో బీజేపీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. అని ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్‌ షా, పరిపూర్ణానంద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బీజేపీ వచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఎందుకు ఖాళీ అవుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీజేపీ ఖాళీ అవుతోంది.. ఇది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మెజారిటీని మరింత పెంచుతుంది. టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేతలను బాగా చూసుకుంటాం. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తాం.

కూటమి పేరుతో అవకాశవాద రాజకీయాలు
మహాకూటమి పేరుతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీ పెత్తనం తెలంగాణలో చెల్లదు. చంద్రబాబు ఢిల్లీలో రాహుల్‌ వద్ద మోకరిల్లారు. కూటమికి ఓటేస్తే రాష్ట్రంలో సంక్షోభం వస్తుంది. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే సంక్షేమం జరుగుతుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ బంద్‌ చేస్తామని ఆ పార్టీ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ అంటున్నారు. దామచర్ల విద్యుత్‌ ప్లాంట్‌ను నిలిపివేస్తామని మరో నేత అంటున్నారు.

అధికారం కోసం కాంగ్రెస్‌ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను విస్మరించింది. ఇప్పుడేం చెప్పినా ఆ పార్టీని ఎవరూ నమ్మరు. కాంగ్రెస్‌ కార్యకర్తల భార్యలు కూడా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. కోదండరాంను కాంగ్రెస్‌ చీకొడుతున్నా మూడునాలుగు సీట్ల కోసం గాంధీభవన్‌ మెట్ల మీద కూర్చుంటున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెడితే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కోదండరాం మంటగలిపారు.

రాహుల్‌ వద్ద మోకరిల్లారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో కోదండరాం అంటకాగడం సిగ్గుచేటు. తెలంగాణలో జోక్యం చేసుకోనని చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజంలేదు. అసెంబ్లీ భవనాలను ఖాళీగానైనా ఉంచుతున్నారేగానీ తెలంగాణ ఇబ్బంది పడుతున్నా ఇవ్వడంలేదు. ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన అసెంబ్లీ భవనాలను ఇవ్వకుండా తాళాలు వేసి పెట్టుకున్నారు.

తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు...
తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసే చంద్రబాబును ఇక్కడి ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తమ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని లేఖలు రాసి చనిపోయారు. అలాంటి బాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ అమరుల ఆత్మను కూడా క్షోభ పెట్టింది. సిద్ధాంతాలు సరిగా ఉంటే మహాకూటమి పొత్తులు ఎపుడో తేలేవి. టిక్కెట్లపుడే ఇన్ని సిగపట్లు పడుతున్న వారు రేపు పొరపాటున అధికారంలోకొస్తే ఇంకెంత గందరగోళం అవుతుందో.

కూటమి గెలిస్తే రాష్ట్రంలో కొత్తగా సమస్యలు వస్తాయేగానీ పథకాలు రావు. సీట్ల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న పార్టీలు తెలంగాణను ఏం ఉద్ధరిస్తాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లది అవకాశవాద కూటమి. పదవులపై యావ తప్ప వారికి ఇంకేమీ లేవు. టీఆర్‌ఎస్‌ చెప్పిందీ, చెప్పనిదీ.. చేసింది. కేసీఆర్‌ నాయకత్వంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా సస్యశ్యామలం అవుతోంది. ప్రజలు టీఆర్‌ఎస్‌నే నమ్ముతున్నారు. ఉమ్మడి మెదక్‌లో మొత్తం పది సీట్లను టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుంది’అని అన్నారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top