ఎన్నికల వేళ.. బీజేపీకి బిగ్‌ షాక్‌

Manvendra Singh Quit From BJP - Sakshi

జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు, ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్‌ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల వేళ కమళానికి షాక్‌

జైపూర్‌ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్తాన్‌లో అధికార బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. మాజీ కేంద్రమంత్రి జశ్వంత్‌సింగ్‌ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్‌ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బర్మేర్‌ జిల్లాల్లో శనివారం తన అభిమానులతో ‘స్వాభిమాన్‌ ర్యాలీ’ని నిర్వహించిన మన్వేంద్ర.. బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తన తండ్రికి బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించిందని, ఇన్ని రోజులు ఒపిక పట్టామని ఇక సహించేదిలేదని ఆయన పేర్కొన్నారు.

గతకొంత కాలంగా బీజేపీ నాయకత్వంతో అంటీముట్టనట్లు ఉంటున్న మన్వేంద్ర తన రాజీనామాతో పార్టీకి షాకిచ్చాడు. సీఎం వసుంధర రాజే ఇటీవల బర్మేర్‌ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. వసుంధర రాజే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గౌరవ్‌యాత్రపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమె పర్యటిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కాగా బీజేపీకి రాజీనామా చేసిన మన్వేంద్ర తరువాత  ఏ పార్టీలో చేరబోయేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

తన ప్రాంత ప్రజల అభివృద్ధికోసం వారితో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. కాగా మాజీ కేంద్రమంత్రి అయిన జశ్వంత్‌ సింగ్‌కు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ టిక్కెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. కాగా మన్వేం‍ద్ర రాజీనామాతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమళదళానికి ఊహించని షాక్‌ తగిలింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top