మనోజ్‌ తివారిపై మండిపడ్డ మహిళా కాంగ్రెస్‌

Manoj Tiwari Says Its Necessary To Have NRC In Delhi - Sakshi

న్యూఢిల్లీ : అసోం తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. భారత పౌరులను గుర్తించే ‘నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌’ అసోం పౌర తుది జాబితా నేడు వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఢిల్లీలో కూడా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అక్రమ వలసదారులు ఢిల్లీలో తిష్ట వేశారని.. వారి సంఖ్య రాజధానికి ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చదవండిఎన్‌ఆర్‌సీ అసోం తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్‌!

కాగా మనోజ్‌ తివారీ వ్యాఖ్యలపై అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. వలసదారులను ఏరివేయమని వలస వచ్చిన వ్యక్తే చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు...‘ మనోజ్‌ తివారీ గారూ.. బిహార్‌లోని కైమూర్‌లో జన్మించి... ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చదివి...మహారాష్ట్రలోని ముంబైలో పనిచేసి, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పోటీచేసి, మళ్లీ ఢిల్లీలో బరిలో దిగారు. మీరు ఢిల్లీ నుంచి వలసదారులను ఏరివేయాలని కోరుతున్నారు. నిందాస్తుతి తనపేరు మార్చుకోవాలేమో’ అని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే ఎన్‌ఆర్‌సీ భారత పౌరులుగా గుర్తించింది. దీంతో తుది జాబితాలో చోటు దక్కని దాదాపు 19 లక్షల మంది ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top