నన్ను అంతమొందించేందుకు కుట్ర

Manda krishna commented over kcr - Sakshi

కేసీఆర్‌ ప్రభుత్వంపై మంద కృష్ణమాదిగ ఆరోపణ

హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం తనను భౌతికంగా అంతం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్శీగుట్టలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రెండుసార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, కానీ బయటకు పొక్కడం వల్లో, సమయం అనువుగా లేదనో ఆ కుట్ర అమలు కాలేదన్నారు.

తన ప్రాణాలకు హాని జరిగితే కేసీఆర్‌ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలోని కీలక పెద్దలు, అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. తనను హతమార్చే కుట్ర గురించి ఓ మంత్రికి, ఓ ఎమ్మెల్యేకు తెలుసని పేర్కొన్నారు. దీక్ష చేసినప్పుడు ఆ కుట్రను అమలు చేసేందుకే తనను జైలుకు పంపించారని ఆరోపించారు. ఆ మంత్రి, ఎమ్మెల్యే ఎవరనేది త్వరలోనే బయట పెడతానని తెలిపారు.

గతంలో తాను సూర్యాపేట నుంచి కాజీపేట్‌ వెళ్తుండగా ఓ కారు తనను వెంబడించిందని, అనుమానంతో తిరుమలగిరి, కాజీపేట్, సూర్యాపేటలలో ఫిర్యాదు చేశానని చెప్పారు. అప్పటి డీజీపీ అనురాగ్‌శర్మను కలసి ఫిర్యాదు చేసినా ఇంతవరకు దాని వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదని అన్నారు. వర్గీకరణపై కేంద్రం మోసపూరిత, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 13న చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయా వర్గాలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top