దళితుల ఆత్మగౌరవ ర్యాలీలో మాట్లాడుతున్న మంద కృష్ణ
ఈ నెల 17న చలో ఢిల్లీ..
ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
కవాడిగూడ/గన్‌పౌండ్రీ(హైదరాబాద్): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్ మీద దాడి జరిగితే.. ఈ దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. జస్టిస్ బీఆర్.గవాయ్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం సాయంత్రం 4 గంటలకు ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు వేలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ జస్టిస్ బీఆర్ గవాయ్ దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని, ఆయన స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటే ఈ దాడి జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. అందువల్లనే ఈ దాడిని దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నామని చెప్పారు. ఇంత కులవివక్ష పాటించడం అత్యంత అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు..సుప్రీంకోర్టు సుమోటోగా కేసు ఎందుకు స్వీకరించలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఎందుకు ఉండిపోయింది అని ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆందోళన వ్య క్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ పోరాటం కేవలం ఆరంభం మాత్రమే.. ఇక జాతీయస్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 17న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితులను సమీకరించి దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ఎంఆర్‌పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్ పాల్గొన్నారు.


