మల్కాజ్‌గిరి.. మామకు సవాల్‌ !

Malkajgiri Parliamentary Constituency Is Becoming Tough Fight For Malla Reddy - Sakshi

సాక్షి,సిటీబ్యూరో : ఎన్నో విశేషాలున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ విజయం ప్రధాన పార్టీలన్నింటికీ అతిముఖ్యం కావటంతో ఎవరికి వారే వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో వెళుతున్నారు. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయ కుడు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామ చంద్‌రావులు బరిలోకి దిగారు.

ఈ స్థానం నుంచి టికెట్‌ కోసం టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ ఉన్నా.. రాజకీయ సమీకరణాల్లో మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఎంపిక చేసిన అధిష్టానం.. గెలుపు బాధ్యతను మాత్రం మంత్రి మల్లారెడ్డిపైనే మోపింది. మల్లారెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేసిన రెండు ఎన్నికల్లో అల్లుడు రాజశేఖర్‌రెడ్డి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటే.. ఈ ఎన్నికలో మాత్రం అల్లుడి కోసం మామ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తోంది.

నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మల్లారెడ్డి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. రాజశేఖర్‌రెడ్డి విజయం మంత్రి మల్లారెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కావటంతో మామ సవాలుగా తీసుకుని ముందుకు వెళుతున్నారు.  

ఐదేళ్లలో ఎంతో తేడా.. 
2014 ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఇక్కడ విజయం సాధించిన టీడీపీ.. తాజా ఎన్నికలకు వచ్చేసరికి పోటీలోనే లేకుండా పోయింది. ఇక బీజేపీ, జనసేనలు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి. ఈసారి ఎవరికి వారే పోటీకి దిగారు. గడిచిన ఎన్నికల్లో మాజీ ఐఏఎస్‌ అధికారి లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌ నారాయణ, మా జీ డీజీపీ దినేష్‌రెడ్డిలు ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

మొదటిసారే లోక్‌సభకు.. 
ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చామకూర మల్లారెడ్డి తన తొలి ప్రయత్నంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఆపై టీఆర్‌ఎస్‌లో చేరిన మల్లారెడ్డి.. పదవికి రాజీనామా చేసి శాసనసభకు అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. 

తొలిసారే లోక్‌సభపై గురి
రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. మామ మల్లారెడ్డి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తెర వెనక నుంచి అల్లుడు మంత్రాంగమంతా నడిపారు.  మేడ్చల్, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో రాజశేఖర్‌రెడ్డికి విస్తృత సంబంధాలున్నాయి. తన గెలుపు బాధ్యతను మల్లారెడ్డితో పాటు బంధువులపై ఉంచి తాను ప్రజలతో మమేకం కానున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top