పార్లమెంట్‌ సభ్యులకు భలే సౌకర్యాలు | Lok Sabha MP Salary Allowences | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సభ్యులకు భలే సౌకర్యాలు

Mar 28 2019 11:28 AM | Updated on Mar 28 2019 11:28 AM

Lok Sabha MP Salary Allowences - Sakshi

సాక్షి, భువనగిరి : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపం పార్లమెంట్‌.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఏర్పాటైన తొలిసభ నాటి నుంచి నేటి వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సగౌరవంగా నిలబడింది. పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా జీవనానికి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాంటి ప్రజాప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించింది. 

కార్యాలయం
ప్రతి పార్లమెంట్‌ సభ్యుడి పరిధి పలు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. కావున స్థానికంగా ప్రజల సౌకర్యాల కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేస్తే నెలకు రూ. 45 వేలు చెల్లిస్తారు. దీంతో పాటు సమావేశాల నిర్వహణకు మరో రూ.45 వేలు ఇస్తారు. దీంతో పాటు స్టేషనరీ ఖర్చుల కోసం రూ.15 వేలు అందుతాయి. పీఏను నియమించుకుంటే రూ.30 వేల వేతనం చెల్లిస్తారు. 

ఎంపీల జీతభత్యాలు  
ఎంపీలకు రూ.50 వేలు ఉన్న వేతనాన్ని గతేడాది నుంచి రూ.లక్షకు పెంచారు. మాజీ సభ్యుడికి నెలకు రూ.25వేల పెన్షన్‌ అందజేస్తారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన సభ్యుడికి రోజుకు రూ.రెండు వేలు చెల్లిస్తారు. 

గృహ వసతి 
పార్లమెంట్‌ సభ్యుడు ఇష్టమైన చోట నివాసం ఉండొచ్చు. ఈ అద్దె అలవెన్సులు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. పదవీకాలం ముగిసిన ఒక నెల పాటు ఉండవచ్చు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వడ్డీ లేకుండా రూ.4 లక్షల రుణం ఇస్తారు. ఇల్లు, కార్యాలయం నిర్వహణకు ప్రతి మూడు నెలలకోసారి రూ.75 వేలు చెల్లిస్తారు. ఏడాదికి 50 వేల లీటర్ల నీళ్లు, 50 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుంది. 

అతిథి మర్యాదలు 
ఎంపీని కలిసేందుకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఢిల్లీలోని వెస్ట్‌కోర్టు వసతి గృహం, జన్‌పథ్‌లో వసతి పొందవచ్చు. ప్రతి ఎంపీ మూడు టెలిఫోన్‌ కనెక్షన్లను వినియోగించుకోవచ్చు. ప్రతి ఫోన్‌ నుంచి 50 వేల కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. ఇందులో రెండు 3జీ కనెక్షన్‌లు ఉంటాయి. 

వైద్య సేవలు
ప్రతి ఎంపీ వైద్య సేవల కోసం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో క్లాస్‌–1 చికిత్స పొందవచ్చు. ఎంపీలకు అందించే అన్ని రకాల వసతులు, నిర్వహణ ఖర్చులు ఆదాయపన్ను పరిధిలోకి తీసుకోరు. 

రవాణా సౌకర్యాలు 
పార్లమెంట్‌ సభ్యుడు తన విధి నిర్వహణలో ఏ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినా ఉచిత రవాణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. రోడ్డు మార్గంలో అయితే ప్రతి కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు. రైలు ప్రయాణంలో ఎంపీతోపాటు అతని భార్య, లేదా భర్తతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఏసీతో పాటు రెండో తరగతి చార్జీలు చెల్లిస్తారు. విమానంలో అయితే ఏడాదిలో 34 సార్లు ప్రయాణించే సదుపాయం పార్లమెంట్‌ సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement