అందరి నోట రైతుల మాట

Lok Sabha Campaign Parties Mostly Talking About Formers - Sakshi

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు రైతుల సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్నాయి. ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వే యడంతో ఇక్కడి ఎన్నిక దేశం దృష్టిని ఆ కర్షించింది. తమ సమస్యలపై చర్చ జర గాలనే ఉద్దేశంతో పోటీలో నిలిచినట్లు రైతులు చెబుతుండగా.. ప్రధాన పార్టీలు సైతం రైతుల సమస్యలపైనే ప్రచారం చేస్తున్నాయి. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తుండగా.. రైతుల సమస్యలతోపాటు పేదరికాన్ని తరిమికొడతామంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. 

సాక్షి, జగిత్యాల: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 11న లోక్‌సభకు ఎన్నికలు జరుగనుండగా.. 9వ తేదీతో ప్రచార గడువు ముగియనుంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఈసారి రైతులు, రైతుసంఘాలు సంఘటితమై పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడంతో పార్టీలన్నీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ముందు పసుపురైతులు తమ సమస్యలపై గళమెత్తారు.

నామినేషన్లతో ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ ఎన్నికల ప్రచారంలో పసుపు రైతుల సమస్యలే ప్రధానాస్త్రంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తమను ఎన్నుకుంటే ముందుగా మీ సమస్యలనే పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం పసుపు, ఎర్రజొన్న రైతుల చుట్టే తిరుగుతోంది.   

రైతుల పక్షపాతిగా టీఆర్‌ఎస్‌  
సిట్టింగ్‌ ఎంపీ, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎక్కడికెళ్లినా ప్రచారంలో పసుపు రైతులను ప్రస్తావిస్తున్నారు. పసుపుబోర్డు కోసం, పంట మద్దతు ధర, రైతుల సమస్యల కోసం ఇప్పటి వరకు అందరి కంటే ఎక్కువగా పోరాడింది తానేనని చెబుతున్నారు. పసుపు రైతుల సమస్యలపై గతంలో పార్లమెంట్‌లో గళం వినిపించానని, ఈసారి అవకాశం ఇస్తే పసుపుబోర్డును సాధించి తీరుతామని హామీ ఇస్తున్నారు. తమ పార్టీకి 16 సీట్లు అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిస్తామని ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి పథకాలు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల పక్షపాతిగా నిలిచామని పేర్కొంటున్నారు.  

బీజేపీ నోట పసుపుబోర్డు 
బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ సైతం తమ ఎన్నికల ప్రచారంలో పసుపు రైతులనే ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే మళ్లీ తమ పార్టీ అధికారం చేపట్టిన వారంలోగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు నామినేషన్లు వేశారని ఆయన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.  

కాంగ్రెస్‌ సామాన్యుల బాట 
కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ ప్రచారంలో ప్రధానంగా రైతుల సమస్యలు, పేదలకు నెలకు రూ.6వేలు ఇస్తామని ప్రస్తావిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. తమ పాలనలో పసుపు పంటకు రూ.10వేలకు పైగా ధర ఉందని, తిరిగి అధికారంలోకి వస్తే పసుపుబోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు రైతులకు న్యాయం చేస్తామని, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరను కల్పిస్తామంటున్నారు.  

మహిళల ఓటు నిర్ణయాత్మకం 
జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 6,63,231 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 3,41,370 మంది, పురుషులు 3,21,370 మంది ఉన్నారు.   

బీడీ కార్మికులపై ఆశలు 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులపై అధికంగా ఆశలు పెట్టుకుంది. జిల్లాల్లో ప్రస్తుతం 60 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ అందుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో కోరుట్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 40 వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లతోపాటు పీఎఫ్‌ ఉన్న ప్రతీ కార్మికురాలికి ఆసరా పెన్షన్‌ అందజేస్తామని ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

మే నెల నుంచి పెరిగిన మొత్తంతో అందరికీ పెన్షన్‌ అందజేస్తామని చెబుతున్నారు. ఇలా పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో రైతులు, మహిళల సమస్యలే ప్రధానాస్త్రాలుగా సాగుతున్నారు. అయితే ఓటర్లు ఎవరి వైపు ఉంటారో మరికొన్ని రోజుల్లో తేలనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top