కేసీఆర్‌కు గుణపాఠం చెప్పండి: ఉత్తమ్‌

lets give a clarification to kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోసపూరిత హామీలతో ప్రజలను దగాచేసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను కేసీఆర్‌ ఏనాడు పరామర్శించలేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, యాదాద్రి జిల్లా వలిగొండ ట్రాక్టర్‌ ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకుంటామని, పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడుకుంటామన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం పాలకవీడుకి చెందిన 400 మంది టీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌లో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. వారందరికీ ఉత్తమ్‌ కాంగ్రెస్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు హుజూర్‌నగర్‌ నుంచి పోటీచేస్తున్న ఉత్తమ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

‘సోనియా దృఢసంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం’
మేడ్చల్‌: యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ దృఢసంకల్పంతోనే తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని సోనియా తెలంగాణను ఇస్తే మాయమాటలతో పీఠమెక్కిన సీఎం కేసీఆర్‌ ఏ ఒక్క హమీని నెరవేర్చలేదని విమర్శించారు. సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇద్దరూ కలిసి ఓకే సభలో పాల్గొనడం అరుదైన ఘటన అని అన్నారు. ఈ నెల 23న మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లను ఉత్తమ్, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బుధవారం వేర్వేరుగా పరిశీలించారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సోనియా మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, కృతజ్ఞతా భావంతో ప్రజలు అధిక సంఖ్యలో సభకు హాజరుకావాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top