‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’

Laxman Speech At BJP Public Meeting At Indira park - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్‌ ఆమోదం పొందడంతో.. పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేకపోవడంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమి.. ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు. 

నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్‌ తలోగ్గిందని లక్ష్మణ్‌ విమర్శించారు. ఆ రోజు కాంగ్రెస్‌ అలా చేయకపోతే.. నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు. గతంలో పాకిస్తాన్‌లో 23 శాతం ఉన్న హిందువులు.. నేడు 1 శాతానికి పరిమితమయ్యారని గుర్తుచేశారు. మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏపై విష బీజాలు నాటే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

దేశ భక్తులు ఈ బిల్లు సమర్థించండి : రాజా సింగ్‌
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మాట్లాడుతూ.. ‘నేడు దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య సంఘర్షణ జరుగుతోంది. మేము ప్రధాని మోదీ ఏది చెబితే అది చేస్తాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. దేశ ద్రోహులను దేశం నుంచి వెళ్లగొడతాం. రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ ఆర్టికల్‌ 370ని రద్దుచేసి కశ్మీర్‌, దేశాన్ని కాపాడారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారతదేశంలోని ముస్లింలు ఇక్కడే ఉంటారు. ఇతర దేశాల్లో నివసించే భారతీయులను మన దేశానికి తీసుకురావాలని మోదీ సంకల్పించారు. దేశ భక్తులు సీఏఏను సమర్థించాలి’ అని పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top