కేంద్రం నిధులతో టీఆర్‌ఎస్‌ సోకులు

Laxman fires on TRS Govt about funds - Sakshi

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీజేఎల్పీ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని బీజేపీ శాసన సభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్వినియోగం, కేంద్రానికి పేరు రాకుండా చేసిన కుట్రలపై ప్రజల్లో ఎండగట్టాలని సోమవారం నిర్ణయించింది. బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జూలై 13న రాష్ట్ర పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

హైదరాబాద్‌లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, జన చైతన్యయాత్ర, పరిపూర్ణానందస్వామి అరెస్టుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 13న అమిత్‌ షా హైదరాబాద్‌లో పర్యటించి, పార్టీ విస్తరణ వ్యూహాలను పరిశీలిస్తారని వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం గురించి సూచనలు చేస్తారని వివరించారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని, సాయంత్రం దాకా పార్టీ బలోపేతంపైనే చర్చిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 8 వేల మంది శక్తి ప్రముఖ్‌లతో ఉదయమే అమిత్‌షా సమావేశం ఉంటుందని వెల్లడించారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో పనిచేస్తున్న పార్టీ పూర్తికాలపు కార్యకర్తల (హోల్‌టైమర్లు)తో ఆ తర్వాత సమావేశం ఉంటుందన్నారు. రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతో సాయంత్రం సమావేశమవుతారని వెల్లడించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి కీలక అంశాలపై షా చర్చిస్తారని చెప్పారు.

హైదరాబాద్‌లో పార్టీ బలోపేతానికి కొందరు ప్రముఖులు, ముఖ్యులతో సమావేశమవుతారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నిధుల దుర్వినియోగాన్ని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్ర పథకాలు, విడుదల చేసిన నిధుల వివరాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో 14 రోజుల పాటు జరిగిన జన చైతన్యయాత్రపై ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఈ యాత్రతో బీజేపీకి ఊపు వచ్చిందని, పార్టీ శ్రేణల్లోనూ ఉత్సాహం వచ్చిందని సమావేశంలో అభిప్రాయపడినట్లు చెప్పారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం అప్రజాస్వామికమని ఖండించారు. 

స్వామి గృహనిర్బంధం అప్రజాస్వామికం: లక్ష్మణ్‌ 
శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు, నిరసన ప్రదర్శనలు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. హిందువులపై, హిందూమతంపై, హిందువులు ఆరాధించే దేవుళ్లపై కొందరు చేస్తున్న అహంకారంగా కించపరిచే వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top