రేవంత్‌ వర్సెస్‌ రమణ!

L. Ramana letter to chandrababu over revanth reddy issue - Sakshi

తెలంగాణ టీడీపీలో ముదిరిన సంక్షోభం 

ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం 

వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎల్పీ నేతగా రేవంత్‌ను తొలగించాం: రమణ 

గోల్కొండ హోటల్‌లో పార్టీ నేతలతో నేడు సమావేశం 

టీడీఎల్పీ వ్యవహారాల్లో తలదూర్చేందుకు రమణ ఎవరు: రేవంత్‌ 

టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లూ కలసి పని చేసిన ఇద్దరు నేతల మధ్య విభేదాలు చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరాయి. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు ఒక్కసారిగా ఆ పార్టీని ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో రేవంత్‌ భేటీ కావడంతో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే టీడీపీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌ను మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ నిలదీయడంతో.. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, విదేశాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు వచ్చాక అన్ని విషయాలు వివరిస్తానని రేవంత్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన ఏపీ టీడీపీ నేతల వ్యవహారంపై చేసిన ప్రకటనలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్‌కు ఏపీ మంత్రులు, కొందరు నాయకులు వంగి సలాములు కొడుతున్నారంటూ రేవంత్‌ చేసిన విమర్శకు అటు నుంచి జవాబు లేకపోగా పొలిట్‌బ్యూరోలో తెలంగాణ నేతలతోనే చర్చకు పెట్టారు. కాంగ్రెస్‌ నేతలతో కలసినట్లు వస్తున్న వార్తలపై రేవంత్‌ వివరణ ఇవ్వాలని రమణ ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎల్పీ నేత పదవుల్లో రేవంత్‌ కొనసాగితే పార్టీ కి నష్టమని చంద్రబాబుకు నివేదిక పంపా రు. చివరకు రేవంత్‌ పదవులు ఏవీ ఉండవని, కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతారని బుధవారం ప్రకటన విడుదల చేశారు.

రేవంత్‌ ఎమ్మెల్యే మాత్రమే..: ఎల్‌.రమణ 
బుధవారం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు హాట్‌హాట్‌గా మారాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో అసెంబ్లీ వ్యూహంపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం జరగాల్సి ఉంది. టీడీఎల్పీ నేతగా రేవంత్‌ ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు, ఎల్పీ నేత పోస్టుకు దూరంగా ఉండాలని కోరామని, ఆయన  ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారని, ఈ మేరకు చంద్రబాబు తనకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారని రమణ ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో ఎల్పీ సమావేశం నిర్వహించాలని రేవంత్‌ నిర్ణయించగా, గోల్కొండ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతలతో సమావేశానికి రమణ ప్లాన్‌ చేశారు. రేవంత్‌ సమావేశానికి ఎవరూ వెళ్లకూడదని పార్టీ నేతలను ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేగా గోల్కొండ హోటల్‌లో నిర్వహించే సమావేశానికి రావాల్సిందిగా రేవంత్‌కు ఆహ్వానం పంపామని రమణ చెప్పారు.

తన పని చూసుకుంటే మంచిది: రేవంత్‌ 
మరోవైపు గోల్కొండ హోటల్‌లో జరిగే భేటీ గురించి తనకు తెలియదని, ఎలాంటి ఆహ్వా నం అందలేదని రేవంత్‌ స్పష్టం చేశారు. ‘టీడీఎల్పీ నేతను నేనే. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు? ఆయన తన పని తాను చూసుకుంటే మంచిది’ అని రేవంత్‌ హితవు పలికారు. చంద్రబాబు తిరిగి వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడే ప్రసక్తి లేదని రేవంత్‌ నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గం చెబుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top