జాతీయ పార్టీలకు భవిష్యత్‌ లేదు

KTR Prices Harish Rao Over Assembly Election - Sakshi

దక్షిణాదిలో పట్టు కోల్పోతున్న కాంగ్రెస్, బీజేపీ

కేసీఆర్‌కున్న ప్రజామోదాన్ని చూసే టీఆర్‌ఎస్‌లోకి నేతలు

సునీతా లక్ష్మారెడ్డి చేరిక సభలో కేటీఆర్‌

మెదక్‌ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లు గెలవడానికి హరీశ్‌రావే కారణం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జాతీయ పార్టీలకు ఉనికి లేకుండా పోయిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దక్షిణాదిన పట్టు కోల్పోతున్నాయన్నారు. మెదక్‌ నియోజకవర్గంలో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్‌ నియోజకవర్గ నేతలతో కలసి సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘తెలంగాణలో పాయలన్నీ ప్రధాన నదిలో కలిసినట్లు అన్ని పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ప్రజలందరూ కేసీఆర్‌ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు కనుకే టీఆర్‌ఎస్‌లో అన్ని పార్టీల నేతలు చేరుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి చేరికతో టీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌లో బలోపేతమవుతుంది. మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్‌లలో టీఆర్‌ఎస్‌కు లక్ష మెజారిటీ చొప్పున వస్తుంది.

మెదక్‌ ఎంపీ సీటులోనే టీఆర్‌ఎస్‌కు అత్యధిక మెజారిటీ వచ్చేలా ఉంది. కరీంనగర్‌లోనూ భారీ మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. మెదక్‌లో భారీ మెజారిటీ వస్తే కొంత క్రెడిట్‌ నాకు కూడా ఇవ్వండి (సునీతా లక్ష్మారెడ్డిని పార్టీలో చేర్పించినందుకు). అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలో తొమ్మిది సీట్లు గెలవడానికి హరీశ్‌రావు కృషే కారణం. జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలకు దక్షిణాదిన ఉనికే లేకుండా పోతోంది. పట్టుమని పది సీట్లు కూడా దక్షిణాదిలో గెలవని పార్టీలు కూడా జాతీయ పార్టీలేనా? బీజేపీ నేతలు మాటలు పెద్దగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేస్తానో అని చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై విమర్శలకే పరిమితమయ్యారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 160–170 సీట్లకు మించి రావు. కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటవు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసించవచ్చు. ఢిల్లీలో తెలంగాణ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే మనం అనుకున్న అన్ని ప్రాజెక్టులు సాధించుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే జాతీయ పాలసీ అంటూ తెలంగాణకు చేసేదేముండదు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కోసం ఆలోచిస్తారు. 37 ఏండ్ల టీడీపీ తెలంగాణలో పోటీ చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌: హరీశ్‌రావు
తెలంగాణలో ఇక జై కాంగ్రెస్‌ నినాదం మరవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని మరోమారు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సునీతా లక్ష్మారెడ్డి లాంటి నాయకులకే కాంగ్రెస్‌ నాయకత్వంపై విశ్వాసం పోయిందని, కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని ఆ పార్టీ నాయకులకు అర్థమైందన్నారు. ‘‘దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ అయింది. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ రెండు పార్టీలు ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఒకటి రెండు చోట్ల డిపాజిట్లు వస్తే ఆ పార్టీలకు అదే గొప్ప. ఈ ఎన్నికల్లో మనకు మనమే పోటీ. జహీరాబాద్‌లో రాహుల్‌ సభకు జనం లేరు. 15 వేల కుర్చీలు వేస్తే 5 వేల మంది కూడా రాలేదు.

మెదక్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నామినేషన్‌కు వెయ్యి మంది కూడా వెంటలేరు. కాంగ్రెస్‌ పార్టీకి చివరకు కార్యకర్తలు కూడా కరువయ్యారు. మోదీకిగానీ రాహుల్‌కుగానీ తెలంగాణ మీద ప్రేమ లేదు. ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన రాహుల్‌... తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఒక్క మాట చెప్పలేదు. తెలంగాణాలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీజేపీ గెలవగలిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు, చివరికి ఫ్లోర్‌లీడర్‌ కూడా ఓడారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే పరిస్థితి పునరావృతం కానుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఐదేళ్లలో కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు. మోదీ దానిపై మాట్లాడలేదు. నీతి ఆయోగ్‌ చెప్పినా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వలేదు. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాను సాధించుకోవాలంటే 16 ఎంపీ సీట్లు గెలవాలి’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top