బల్దియాపై బాణం

KTR Focus on GHMC Elections - Sakshi

జోనల్‌ కమిషనర్లతో అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్‌ సమీక్ష

సీఆర్‌ఎంపీ పనుల వేగం పెరగాలని ఆదేశం

ప్రజాసేవలు..‘అభివృద్ధి’కి ప్రాధాన్యం

దాదాపు ఏడాదిలో ఎన్నికలు

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. దాదాపు ఏడాదికాలంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ప్రజలను ఆకట్టుకునేందుకు అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ పనులుపూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు జీహెచ్‌ఎంసీ జోనల్‌కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులతో  శేరిలింగంపల్లి జోన్‌లో జీహెచ్‌ఎంసీ పనుల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ప్రజలకందే సేవలు పెరగాలని, అభివృద్ధి బాగా కనిపించాలని దిశానిర్దేశం చేశారు. ఫుట్‌పాత్‌లు, స్కైవేలు, బస్‌షెల్టర్లు, బస్‌ బేలు, జంక్షన్ల అభివృద్ధి పనులు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు,పార్కుల్లో పబ్లిక్‌ టాయ్‌లెట్లు, స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు, శ్మశాన వాటికలు, రోడ్ల నిర్వహణ పనులు తదితరమైన వాటికి సంబంధించిన లక్ష్యాలు.. పురోగతి తదితరవివరాలను అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. 

రోడ్ల పనుల వేగం పెరగాలి..
రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ పనులు తగిన వేగంతో జరగడం లేవని అభిప్రాయపడ్డారు. చాలా స్లోగా  ఉన్నాయని, ఈ పనుల వేగం పెరగాలని ఆదేశించారు. కొన్ని ఏజెన్సీలు ఇంకా బీటీ మిక్స్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం.. పనులు ప్రారంభించకపోవడాన్ని ప్రస్తావించారు.  ఈపనుల వేగం పెరగాలని, ఎస్సార్‌డీపీ పనుల వేగం కూడా పెరగాలన్నారు. ఈ  రెండు అంశాలపై శనివారం  ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానన్నారు. మోడల్‌ మార్కెట్లను త్వరితంగా అందుబాటులోకి తేవాలన్నారు. అక్రమ నిర్మాణాలను త్వరితంగా కూల్చివేసేందుకు ఆధునిక ఉపకరణాలేమేమి ఉన్నాయి.. వాటి ధరలు.. పనితీరు..వాటిని జీహెచ్‌ఎంసీ సమకూర్చుకోవడానికి సంబంధించి చర్చించారు.

గతంలో హైదరాబాద్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ భవనం కూల్చివేతకు వినియోగించిన యంత్రం ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. అలాంటి ఒక యంత్రం అద్దెకు తీసుకుంటున్నట్లు, భారీ భవంతుల కూల్చివేతలకు దాన్ని వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఓబీల నిర్మాణంలో ఫుట్‌పాత్‌లకు భంగం కలుగకుండా స్థలం ఉంటే దాన్ని సేకరించాలని సూచించారు. తక్కువ స్థలంలో చిట్టడవుల పెంపకానికి ‘మియావాకి’ విధానాన్ని అనుసరించాలని సూచించారు. శేరిలింగంపల్లి జోన్లలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి జోనల్‌ కమిషనర్‌ హరిచందన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ప్లాస్టిక్‌ రీసైకిల్డ్‌ టైల్స్‌ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లు తదితరమైనవి బాగున్నాయని, మిగతా అన్ని జోన్లలోనూ వాటిని అమలు చేయాలని సూచించారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌లో లైటింగ్‌ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. వివిధ పనుల్లో నూతనత్వాన్ని, సృజనాత్మకంగా  ఆలోచనలు చేయాలని సూచించారు. దుర్గంచెరువుపై ఏర్పాటు చేసే లైటింగ్‌ గురించి ప్రస్తావించారు. సమావేశంలో కమిషనర్‌ లోకేశ్‌కుమార్, జోనల్‌ కమిషనర్లు, సీసీపీ, సీఈలు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top