
కొత్తపల్లి గీత
అరసవల్లి(శ్రీకాకుళం): ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీత తమ పార్టీ సభ్యురాలు కాదని, ఆమె వైఎస్సార్‌సీపీ ఎంపీ అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు దీక్షలతో ప్రజాధనం వృథా అని ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారని ఓ విలేకరి ప్రస్తావించగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ ఈశ్వరయ్య చంద్రబాబు హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యం వల్లనే అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడం సాధ్యం కాదన్నారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు.
పట్టిసీమ అక్రమాలపై ప్రశ్నిస్తున్న బిజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాటలకు విలువలేదని, ఆయన రోజుకోమాట మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదాన్ని, ఉద్యమాన్ని బతికించి నడిపిస్తున్నది చంద్రబాబు మాత్రమేనన్నారు.