సొంత పార్టీపై రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy Slams Congress Leadership - Sakshi

జైలు నేతలకు కూడా అంత ప్రాధాన్యమా అని ధ్వజం

సాక్షి, నల్గొండ : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. గాంధీభవన్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదనీ.. ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యముందో తెలుసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వానికి హితవు పలికారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పీసీసీ కమిటీల నియామకాలపై ఆయన మండిపడ్డారు. వార్డు మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేనివారికి కమిటీలలో ప్రాధాన్యమిచ్చారని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 

నిన్న, మొన్న పార్టీలో చేరిన వారికి... జైలుకు వెళ్లొచ్చిన వారికి పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఓటుకు కోట్లు కేసులో జైలుకెళ్లొచ్చిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తదనంతర జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ నూతన వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం నియమించారు. దీని పట్ల రాజగోపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీ చేస్తానని రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పీసీసీ కమిటీల్లో భాగంగా రాజగోపాల్‌రెడ్డికి ఎలక్షన్‌ కమిటీలో కాంగ్రెస్‌ స్థానం కల్పించింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవమే ధ్యేయంగా కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో తాము ఆశించిన స్థానానికి టికెట్లు వస్తాయో.. రావోనని కాంగ్రెస్‌ నేతల్లో అలజడి మొదలైంది. 2014 ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసిన రాజగోపాల్‌ రెడ్డి బూర నర్సయ్య గౌడ్‌ చేతిలో ఓడిపోయారు.

చదవండి : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్, పొన్నం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top