
న్యూఢిల్లీ: తన వ్యాఖ్యలతో, వ్యవహార సరళితో కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్న సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం ఢిల్లీలో దర్శనమిచ్చారు. అయితే, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో తాను ఢిల్లీకి వచ్చానని, తన హస్తిన పర్యటనలో ప్రత్యేకత ఏమీ లేదని రాజగోపాల్‌రెడ్డి మీడియాతో తెలిపారు.
తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటం చేసి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండేదని, తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకు ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు.
బీజేపీలోకి చేరికపై రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ఆ పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చలు జరిపినట్టు కథనాలు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీరుపై, టీపీసీసీ వ్యవహార సరళిపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయం బీజేపీయేనని ఆయన పేర్కొన్నట్టు వ్యాఖ్యలు వచ్చాయి.