
దూరాజ్‌పల్లి (సూర్యాపేట): రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన ఆల్‌ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘ్ (ఏఐకేఎంఎస్) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలకు ఆయన హాజరై మాట్లాడారు. బ్యాంకుల నుంచి రుణాలు అందక, ప్రకృతి సహకరించకపోవడంతో సరైన దిగుబడి రాక, మద్దతు ధర అందక అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వ్యవసాయాన్ని విస్మరించి దాని అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుండటంతో అది రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని చెప్పారు. పాలీహౌస్, గ్రీన్‌హౌస్ వంటి వాటికి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోందని, దీని వల్ల చిన్న, సన్నకారు రైతులకు మేలు జరగడం లేదన్నారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వర్‌రావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.