‘కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ క్షమాపణలు చెప్పాలి’

Published Tue, Apr 17 2018 1:40 PM

Kishan Reddy Demands Apology From Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 11 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడిపై కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటిదని బీజేఎల్పీ నాయకుడు కిషన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాంబు పేలుడిని అప్పటి కాంగ్రెస్‌ నాయకులు హిందూ టెర్రరిజమ్‌గా, కమల ఉగ్రవాదంగా ముద్ర వేయాలని యత్నించారని గుర్తు చేశారు.

దేశ చరిత్రను మంట కలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందని అన్నారు. సోనియాగాంధీ, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్‌ సింగ్ లాంటి వారు ఆనాడు కాషాయ రంగు ఉగ్రవాదం మొదలైందని, ఇస్లాం, పాకిస్థాన్, మావోయిస్టుల ఉగ్రవాదం కంటే హిందూ ఉగ్రవాదం ప్రమాదకరమని వ్యాఖ్యానించారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు రాజకీయానికి ఇది అద్దం పడుతుందని విమర్శించారు. ఉగ్రవాదానికి మతం, కులం ఉండదని అన్నారు. కాషాయ ఉగ్రవాదం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. కోర్టుల్లో వాదనలు, సాక్ష్యాలు ఆధారంగానే తీర్పు చెబుతారే తప్ప మనుషులెవరో చూసి, ప్రాంతాలు ఏవో తెలుసుకుని తీర్పు చెప్పరని ఘాటుగా స్పందించారు.

దేశంలో జరిగిన అన్ని మతకలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. ‘దళితులను ఊచకోత కోసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడ అల్లర్లు, ఉగ్రవాదం మూకలు చెలరేగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన ఉగ్ర దాడులకు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్‌ల నుంచే మూలాలు ఏర్పడ్డాయి.

అప్జల్ గురుపై ఇచ్చిన తీర్పు వెనక మన్మోహన్ సింగ్ ఉన్నారా?. కసబ్ తీర్పు వెనక సోనియాగాంధీ ఉన్నారా?. ఎంఐఎం పార్టీకి న్యాయవ్యవస్థ పై, పోలీసు వ్యవస్థపై గౌరవం లేదు. వాటి వెనక వారు ఉంటే నిన్న ఇచ్చిన తీర్పు పై మాట్లాడండి. ఇప్పటికైనా కాషాయ ఉగ్రవాదం అనే మాటలకు క్షమాపణ చెప్పాలి. జడ్జీ రాజీనామా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. టీవీల్లో వార్తలు చూశాం కానీ దీనిపై ఇంకా నిజాలు తెలియాల్సివుంది.’ అని​ కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement