
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు(కారు) కేవలం వారి కుటుంబ సభ్యులు కూర్చోవడానికి మాత్రమే సరిపోతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, స్టార్ క్యాంపెయినర్ ఖుష్బూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివిధ పథకాలలో కమిషన్లు తినడంలో ప్రమేయం ఉందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనకు 6% శాతం కమిషన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా తన సొంత ప్రచారాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
విద్యావ్యవస్థ కుంటుపడింది..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఖుష్బూ విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంతవరకు సెక్రటేరియట్‌కు వెళ్లని ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించకపోవడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.