
టీడీపీ దౌర్జన్యాలపై డీఎస్పీకి వివరిస్తున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ముదిగుబ్బ: ధర్మవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వైఖరి కారణంగా టీడీపీ నాయకుల అరాచకాలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని «ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, తాను అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు భరోసానిచ్చారు. సోమవారం ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాజశేఖర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, బయపరెడ్డి,రమేష్, ఇర్పాన్, రాజుల ఇళ్లకు వెళ్లి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కేతిరెడ్డికి వివరించారు. నవరత్నాలపై గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ నాయకుడు దేవేంద్రనాథ్‌రెడ్డి అనుచరులతో వచ్చి దాడి చేశారన్నారు. పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
అరాచక పాలనకు త్వరలోనే చరమగీతం
తెలుగుదేశం అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని కేతిరెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలకు న్యాయం జరిగేందుకు ఎందాకైనా పోరాటం సాగిస్తామన్నారు. ఎవ్వరూ అధైర్యపడవద్దన్నారు. అనంతరం మండల పరిధిలోని మలకవేముల క్రాస్‌లో సేవేనాయక్‌ను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణరెడ్డి,రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వేలూరి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
శాంతి భద్రతలు పరిరక్షించండి
ధర్మవరం నియోజకవర్గంలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని కేతిరెడ్డి కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం పట్నం పోలీస్‌స్టేషన్‌లో ఆయన డీఎస్పీని కలిసి అధికార పార్టీ ఆగడాలను వివరించారు. ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడితే విచారణ జరిపి న్యాయం చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అరికట్టాలని ఫిర్యాదు చేసేందుకు భాదితులు పోలీస్‌స్టేషన్‌కు వెళితే ప్రతిగా వారిపైనే కౌంటర్‌కేసులు కడుతున్న దుర్మార్గపు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వలన భవిష్యత్‌లో మరిన్ని సంఘటనలు పునరావృతమై శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.