
సాక్షి, విజయవాడ: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తిరుగుబావుటా ఎగరవేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు అవకాశం రావడంతో నిశబ్ద పోరాటానికి తెరలేపారు. విజయవాడ ఎంపీగా రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పదవిని తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. నాని టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని నాని ఖండించారు.
లోక్‌సభ విప్ పదవి తిరస్కరణ....
రాష్ట్రం నుంచి టీడీపీ ఎంపీలుగా కేశినేని నానితోపాటు గల్లా జయదేవ్ (గుంటూరు), రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం) గెలుపొందారు. ఫ్లోర్‌లీడర్, డెప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆ ఇద్దరికి ఇచ్చి కేశినేని శ్రీనివాస్‌కు పార్టీ విప్‌పదవి ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని నాని ఆ పదవిని తిరస్కరిస్తూ సోషల్ మీడియాలో పెట్టారు. తాను కేవలం ఎంపీగానే ప్రజలకు సేవ చేస్తానంటూ పేర్కొన్నారు. దీంతో ఆయన టీడీపీ వీడిపోతారంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న ఎంపీ గల్లా జయదేవ్ విజయవాడ వచ్చి ఆయన్ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేగాక అదే రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కేశినేని నానికి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వపోవడంపై కేశినేని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక పదవులు తనకు ఇవ్వకపోవడంతో పాటు జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా పెత్తనంపై కేశినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన ఒంటెత్తు పోకడల వల్లనే పార్టీ నష్టపోయిందని చెప్పడంతో కేశినేని నానికి చంద్రబాబు సర్ది చెప్పి అన్నీ సరిచేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
బీజేపీ నేతలతో మంతనాలు
రెండవసారి ఎంపీగా గెలుపొందినప్పటి నుంచి ఎంపీ కేశినేని నాని స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని, కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీలను కలిసి అభినందనలు తెలపడంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించి ఉంటే హాజరయ్యేవాడినంటూ ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ ఇఫ్తార్ విందుకు దూరం...
ఈ నెల 3న జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిర్వహణలో జరిగిన ఈ విందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు హాజరయ్యారు. అయితే నాని మాత్రం ఈ విందుకు దూరంగా ఉన్నారు. మరుసటి రోజు నగరంలోకి వచ్చారు. ఇప్పుడు పార్టీ విప్ పదవిని తిరస్కరించి తన నిరసనను చంద్రబాబుకు స్పష్టంగా తెలియచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.