రుజువేది?

KCR Strong Reply To Bhatti Vikramarka Question Over Vote On Account Budget - Sakshi

భట్టికి సీఎం కేసీఆర్‌ సవాల్‌

కాదంటే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి

రూ. 2 లక్షల కోట్లు కూడా లేని అప్పును రూ. 3 లక్షల కోట్లు అంటారా?

కాళేశ్వరం ప్రాజెక్టు కళ్లకు కనిపిస్తలేదా?

సాక్షి, హైదరాబాద్‌ : ‘గత ఆరేళ్లలో రూ. 2 లక్షల కోట్లు కూడా లేని రాష్ట్ర అప్పు లను రూ. 3 లక్షల కోట్లు అం టారా? అప్పులను ఇలా పెంచి చూపడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. ప్రభుత్వ గ్యారం టీలను కూడా అప్పుగా పరిగణిస్తే ఎలా? ఇవాళ జనం లక్షల సంఖ్యలో టీవీల్లో అసెంబ్లీ లైవ్‌ చూడాలె.. సభలో హీటెక్కాలె. మీరు చెప్పిన లెక్కలు నిజమే అయితే నిరూపించండి. కాదంటే మీ వ్యాఖ్యలు ఉపసంహరించు కోండి’అని సీఎం కె. చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు సవాల్‌ విసిరారు. బడ్జెట్‌ కూర్పును తప్పుబడుతూ భట్టి చేసిన విమర్శలతోపాటు సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేయలేదంటూ ఆయన చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. ‘ప్రపంచంలో రికార్డు బ్రేక్‌ చేసి యావత్తు దేశం ఆశ్చర్యపోయేలా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపిస్తలేదా? కళ్లులేని కబోదులుగా వాస్తవాలను చూసే సంస్కారం మీకు లేక ఇటు శాసనసభను అటు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడితే సహించం.

భలో తప్పులు మాట్లాడితే పదేపదే అడ్డుకుంటం. సభ ఎవరి జాగీరు కాదు’అని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భట్టి విక్రమార్క టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై దాడి ప్రారంభించటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు సీట్లోంచి లేచి భట్టి ప్రసంగంలోని లెక్కలు, ఆరోపణలు అబద్ధాలంటూ సభ దృష్టికి తెచ్చారు. అవాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాతపెట్టినా కాంగ్రెస్‌ సభ్యులకు బుద్ధి రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వాడిన పదాలపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేయగా తాను సోయితోనే మాట్లాడుతున్నానని, ఎక్కడా అన్‌పార్లమెంటరీ పదాలు వినియోగించడం లేదన్నారు. 

ఆ మాటతో మొదలు....
భట్టి విక్రమార్క తన ప్రసంగం ప్రారంభంలోనే ‘మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా మార్చారు. సంపద సృష్టించే వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు’అని పేర్కొనడంతో సీఎం కేసీఆర్‌ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయన లేచి వాస్తవాలు మాట్లాడాలని, బడ్జెట్‌లో ఉన్న విషయం చూసి మాట్లాడితే మంచిదని సూచించారు. బడ్జెట్‌ పుస్తకంలో పొందుపరిచిన వివరాలు కాగ్‌ ధ్రువీకరించిన లెక్కలేనని తాను బడ్జెట్‌ ప్రసంగంలోనే స్పష్టంగా చెప్పానని, వాటిలో వివాదానికి తావే లేదన్నారు. కానీ భట్టి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పులు మాట్లాడటమే కాకుండా సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు స్పష్టంగా ఉంటే భట్టి విక్రమార్క పదేపదే ‘రమారమి’అని అనడం సరికాదన్నారు. ఇక మిగులు బడ్జెట్‌ గురించి ఎలా మాట్లాడతారని, రాష్ట్రమే లేనప్పుడు మిగులు బడ్జెట్‌ ఎక్కడిదని, తెలంగాణ ఏర్పడ్డాక బడ్జెట్‌ పెట్టేందుకు ప్రాతిపదికే లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం సరికాదని హితవు పలికారు. తెలంగాణను దివాలా తీయించామని అంటున్నారని, కానీ అన్ని లెక్కలు సభ ముందున్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో పదేపదే కోత పెట్టామని అనడం సరికాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయింపుల్లో కోత పెట్టిన ఫలితంగానే రాష్ట్ర బడ్జెట్‌ను తగ్గించినట్లు తాను బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టంగా చెప్పినట్టు సీఎం వెల్లడించారు. 

ఆ నీళ్లు కనిపించడం లేదా?
అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీ కళ్లకు కనిపించడం లేదా? అని భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో సంపద సృష్టించే ప్రాజెక్టు ఒక్కటైనా లేదని భట్టి పేర్కొనడం కళ్లుండీ చూడలేకపోవటమేనని విమర్శించారు. మిషన్‌ భగీరథ ద్వారా 56 లక్షల ఇళ్లకు సరఫరా చేస్తున్న మంచినీళ్లు భట్టి కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే మిషన్‌ కాకతీయ కింద బాగు చేసుకొని నీళ్లను నింపుకుంటున్న 27 వేల చెరువులను చూడలేదా అని పేర్కొన్నారు. కేవలం ఏడాదిలోనే పూర్తి చేసిన భక్త రామదాసు ప్రాజెక్టు భట్టి జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు. మీలాగా మొబిలైజేషన్‌ ప్రాజెక్టులు తమవి కావంటూ ఎద్దేవా చేశారు. లక్ష్మీ బ్యారేజీగా ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టును ఇప్పటికే 20 లక్షల మంది సందర్శించిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. ‘వాస్తవాలు ఇలా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఇది సభ. ఎవరి జాగీరు కాదు, తప్పులు మాట్లాడితే మా హక్కులు కాపాడాలి అధ్యక్షా’అంటూ పేర్కొన్నారు. ఐదేళ్లపాటు ఇలాగే మాట్లాడారని, ఆ తర్వాత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా బుద్ధి మారాలేదని కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. మూడొంతుల సీట్లు గెలుచుకొని తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈవీఎంలతో గెలిచారని ఆరోపించారంటూ గుర్తు చేశారు. మరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు సీట్లను ఈవీఎంలతోనే గెలిచిందా అని ప్రశ్నించారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెడుతున్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా మాట్లాడితే చేసేదేమీ లేదని అది వారి కర్మ అని పేర్కొన్నారు.

ప్రాణహిత–చేవెళ్ల గాలిలో ఉండెనా...
కాంగ్రెస్‌ హయాంలోనే కొన్ని ప్రాజెక్టుల పనులు జరిగాయన్న భట్టి మాటలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడుండె.. ఆకాశంలోనా, గాలిలోనా అంటూ ఎద్దేవా చేశారు. అసలు దానికి అగ్రిమెంట్లు కూడా లేవని, దాన్ని రీ డిజైన్‌ చేసి వివరాలను ఇదే సభలో వివరించామన్నారు. ఆ సమయంలో మాట్లాడలేక కాంగ్రెస్‌ వాళ్లు పారిపోయారని విమర్శించారు. ఆ తర్వాతే ప్రజలు మళ్లీ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశ్నించారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ కూడా తెలంగాణవాసులను వంచించిన ప్రతిపాదననేనని, అసలు అది తెలంగాణ ప్రాజెక్టు కాదని ఇదే సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులు అరిచినా పట్టించుకోలేదన్నారు. గ్రావిటీతో నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఆంధ్రాకు ఇచ్చి, లిఫ్ట్‌తో నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. ‘నేను ఉద్యమ నాయకుడిని. నాకు అన్నీ తెలుసు. లేకుంటే మీరు గోల్‌ తిప్పేటోళ్లు, ఆ ప్రాజెక్టును మీరు ఒప్పుకొని మమ్మల్ని ఒప్పుకోమని ఒత్తిడి చేశారు.

పోలవరంలో హెడ్‌ వర్క్స్‌ మునిగిపోయింది మరిచారా’అని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టుల సామర్థ్యం 30 టీఎంసీలైతే తాము ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు 100 టీఎంసీలని గుర్తుచేశారు. అవసరమైతే మరో రూ. 20 వేల కోట్లు కూడా అప్పు తెస్తామని స్పష్టం చేశారు. ఎన్ని అప్పులు తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డిఫాల్ట్‌ కాలేదని, దీన్ని గుర్తించాలన్నారు. అనంతరం సీఎం సభ నుంచి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా భట్టి ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు అంటూ భట్టీ చెప్పబోగా ‘ఏదిపడితే అది గాంధీ భవన్‌లో మాట్లాడుకోండి, సభలో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. మీ ఆరోపణలకు రుజువులు చూపండి. కాదంటే మా నాయకుడికి, మా పార్టీకి క్షమాపణ చెప్పండి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదని, తమ మేనిఫెస్టోలో కూడా లేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top