కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా : కేసీఆర్‌

KCR Speech In Devarakonda Public Meeting - Sakshi

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటే

ఎన్నికల తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తా

కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండాలి

దేవరకొండ బహిరంగ సభలో కేసీఆర్‌

సాక్షి, దేవరకొండ : ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసి నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తాన్నారు. ఎన్నికల తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తామని తెలిపారు. బుధవారం ఆయన దేవరకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంతో కొట్లాడి ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అమలు కావాలన్నారు. ఇంకా కేసీఆర్‌ బహిరంగ సభలో ఏమన్నారంటే..

కచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తా
‘ గిరిజనుల, ముస్లింల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పెడచెవిన పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీని నేను 20 సార్లు కలిశా. 50 ఉత్తరాలు రాశా. అయినా పట్టించుకోలేదు. ఆయనకు హిందు, ముస్లిం అనే బీమారి ఉంది. మన రిజర్వేషన్లు మనకు ఇవ్వమంటే కేంద్రానికి ఏం రోగం. ఈ విషయంలో కాంగ్రెస్‌ కూడా అంతే. బీజేపీ, కాంగ్రెస్‌ దొందు దొందే. ఒకరిది కాషాయం జెండా, మరోకరిది మూడు రంగుల జెండా అంతే తేడా. కేసీఆర్‌ ఒక పని మొదలు పెడితే కొస దాక తెగిస్తాడని మీకు తెలుసు. దేవరకొండ సాక్షిగా చెబుతున్నా కేంద్రంతో కొట్లాడి కచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తా. నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. దాని ద్వారా దళిత, ముస్లిం పోదరుల స్థితి మారుస్తా. రిజర్వేషన్లు కావచ్చు. రాష్ట్రాల హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తా. మనకే కాదు యావత్‌ దేశానికే ఉపయోగ పడే కార్యక్రమాలు చేస్తాం.

తెలివి ఉన్న కాంగ్రెసోళ్లు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదు
మేము తెలిఉన్న నాయకులం అని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు 35 ఏళ్లు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదు. ఇవాల 24గంటల కరెంట్‌ ఇస్తున్నాం. ఇవాల కరెంట్‌ పోతలేదు. తప్పిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారం అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే చీకట్లోకి పోతారు. తెలంగాణ కొడ్లాడి తెచ్చుకున్న తర్వాత నీళ్లకోసం ఆలోచన చేశా. ఒక సంవత్సరం సర్వే చేసి ప్రాజెక్టుల డిజైన్‌ చేశా. అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు ఎలా ఉందో చూపిస్తా అంటే కాంగ్రెస్‌ నాయకులు పారిపోయారు. నిజంగా వాళ్లకు తెలివి ఉంటే ఎందుకు పారిపోవాలి. వాళ్లకు ఏం తెలియదు. తెలంగాణ బాగు చేద్దాం అంటే అడ్డం పడ్డారు. ఎన్నికలకు పోదామా అంటే సై అన్నారు. ఇప్పుడేమో గోడలు గీకుతున్నారు. 

మళ్లీ చంద్రబాబునే తెచ్చుకుందామా..
పోరాడి మన తెలంగాణ మనం తెచ్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు చంద్రబాబను భూజల మీద మోస్తుకొస్తున్నారు. మళ్లీ మనకు చంద్రబాబు కావాలా? ఆయనను తెలంగాణను అప్పగిస్తామా? వచ్చినోడు మనోడు కాదు.. కానీ తెచ్చినోడు మాత్రం మనోడే. ముందు మనోడిని దంచాలి. ఓట్లలతో దంచాలి. ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు ఏం మొఖం పెట్టుకొని వస్తున్నారు. ఇవాళ మళ్లీ వాళ్లు వస్తే ప్రాజెక్టులు ఆపుతారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అనేక పథకాలను ప్రవేశపెట్టాం. కరువుతో నలిగిపోయిన దేవరకొండకు నీళ్లను తెచ్చాం. తండాలను గ్రామా పంచాయతీలుగా మార్చినాం. ఫించన్లను రూ.1000కి పెంచాం. కేసీఆర్‌ కిట్‌, కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టాం. మళ్లీ మన ప్రభుత్వం రాగాగే ఫించన్‌ను రూ.2000లకు పెంచుతాం. రైతబంధు పథకం కిందా ఏడాదికి పదివేల రూపాయలు అందజేస్తాం’ అని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top