ఆగమాగం కావద్దు.. గాలిగాళ్లు గెలుస్తారు : కేసీఆర్‌

KCR Says To People Think Once Before Vote - Sakshi

సాక్షి, కోస్గి (కొడంగల్‌) : ఆగమాగం కాకుండా.. ఆలోచించి ఓట్లు వేయాలని, లేకుంటే గాలిగాళ్లు గెలుస్తారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో జరిగిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు, ప్రజల ఎజెండా గెలవాలని, అప్పుడే మేలు జరుగుతుందన్నారు. పాలమూరు జిల్లాలో 14 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలవబోతుందని జోస్యం చెప్పారు. 

ఇంకా ఏమన్నారంటే.. ‘ 58 ఏళ్ల కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కరెంట్‌ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? తమషా చేస్తే కరెంట్‌ రాలేదు.. కష్టపడితేనే 24 గంటల కరెంట్‌ వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని తెచ్చాం. గుంట జాగున్న రైతులకు కూడా రైతు బీమా వర్తింప జేస్తున్నాం. ఎలాంటి పైరవీలు లేకుండానే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. కల్యాణీ లక్ష్మీతో పేదింటి ఆడపిల్లలకు అండగా ఉన్నాం. మహిళలు ప్రసవిస్తే.. ఒకప్పుడు చాలా దోపిడికి గురయ్యేవారు. ఇప్పుడు ఉల్టా డబ్బులు ఇస్తూ అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దింపుతున్నారు. మేం పెట్టిన సంక్షేమ పథకాలు మీ కళ్లముందే ఉన్నాయి. 

పాలమూరు శత్రువులు..
రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను అడ్డుకుంది చంద్రబాబే. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ చంద్రబాబు చేతుల్లో పెడతారా? పాలమురు జిల్లాలోనే పాలమూరుకు శత్రువులు ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నాగం జనార్థన్‌ రెడ్డి, మరో ముగ్గురు కాంగ్రెస్‌ అభ్యర్థులే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడానికి కేసులు వేశారు. నిన్ననే హైకోర్టు చెంప చెల్లుమనిపించింది. పాలమూరు దరిద్రం వదలాలంటే ఈ దరిద్రులను ఓడించాలి. పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తయితే కొడంగల్‌, నారయణపేట సస్యశ్యామలం అవుతుంది. కులం, మతం, జాతి వివక్ష లేకుండా పాలించాం. పట్నం నరేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఎన్నికల అనంతరం కొడంగల్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడనే కూర్చుని.. మీ సమస్యలను పరిష్కరిస్తా. నర్సింగ్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీల నిర్మాణాలకు ప్రభుత్వం ఏర్పాటైన వారంలో రోజుల్లోనే జీవో విడుదల చేస్తాం. 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాం.’ అని హామీలు ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top