
సాక్షి, వరంగల్ : తాను ఏ తప్పు చేయలేదని, ఇకపై చేయనని.. ఎదైనా చిన్న తప్పు చేస్తే సవరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తనకు మంచి బాధ్యత ఇచ్చారని. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవ్వరూ ఇంత మంచి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. టీడీపీ ఆవిర్భావంలో ఎన్‌టీఆర్ తనను కన్వీనర్‌ని చేసి, 1983 ఎన్నికల్లో బీఫామ్‌లు ఇచ్చి పంపారని వెల్లడించారు. రాజకీయల్లో కలిసి రావాలని పేర్కొన్నారు. పార్టీ కోసం టీం వర్క్‌గా పని చేస్తామని చెప్పారు.
జిల్లా అభివృద్ధికి పాటుపడతానని, బాబ్లీ ఉద్యమంలో తన పాత్ర కీలకమైనది చెప్పారు. దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కానీ కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఎంజీఎం, కేఎంసీ, గ్రామాల్లో స్మశాన వాటికలు ఇలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఉద్యమాల జిల్లాలో యువతకు ఉద్యోగాల కల్పన చాలా అవసరమన్నారు. ఉద్యమ సమయంలో తనను టీడీపీ నుంచి బయటకు రమ్మని చెప్పింది మీడియా మిత్రులేనని గుర్తుచేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, స్పెషల్ రైల్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఏర్పాటుకు కేసీఆర్‌తో మాట్లాడి త్వరగా పూర్తి చేస్తానన్నారు.