ప్రధాని పదవికి కేసీఆర్‌ అర్హుడు

KCR better choice for Prime Minister's post - Sakshi

మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్య

హైదరాబాద్‌: ప్రధానమంత్రి పదవికి కేసీఆర్‌ అర్హుడని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాల పరిధులలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌కు మద్దతుగా అహ్మద్‌నగర్‌ డివిజన్‌ లోని ఫస్ట్‌లాన్సర్‌లో, గోల్కొండ రిసాలా బజార్‌లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల కంటే కేసీఆర్‌ సమర్థుడైన నాయకుడని అన్నారు. పాలన అనుభవంతో పాటు పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన కేసీఆర్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని పదవికి పూర్తిగా అర్హుడని అన్నారు.

ఏ మాత్రం పాలన అనుభవం లేని రాహుల్‌ ప్రధాని పదవికి ఏ విధంగా అర్హుడవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మొత్తం 17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్‌ చక్రం తిప్పే నాయకుడవుతాడని జోస్యం పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉనికి లేని బీజేపీ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు. కేసీఆర్‌ పారదర్శక పాలనను చూసి తాము ఆయన నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్, మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహీయుద్దీన్, తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top