ఆర్మీ చీఫ్‌పై కశ్మీర్‌లో ఆగ్రహం

Kashmir Leaders Angry over Army Chief Comments - Sakshi

శ్రీనగర్‌ : భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌పై జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కశ్మీర్‌ విద్యావ్యవస్థపై రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్‌ విద్యాశాఖా మంత్రి ఇమ్రాన్‌ రాజా అన్సారీ మండిపడ్డారు.

‘‘మీరేం విద్యావేత్త కాదు. విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు. మాకు రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోగలిగే పరిణితి ఇక్కడి విద్యార్థుల్లో ఉంది. మా రాష్ట్రంలో అవినీతి నెలకొందని మీకెవరు చెప్పారు? ప్రతీ స్కూళ్లలో రాష్ట్రానికి సంబంధించిన మ్యాపులు ఉంటాయన్న విషయం మీకు తెలీకపోవటం శోచనీయం’’ అని ఇమ్రాన్‌  పేర్కొన్నారు. 

కాగా, ఆర్మీ డే సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన రావత్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్‌ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని.. యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘జమ్ములో ప్రతీ పాఠశాలలో రాష్ట్రం మ్యాప్‌ ఉంటుంది. అది విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతుంది. తాము ఈ దేశంలో భాగం కాదేమోనని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికితోడు విద్యా వ్యవస్థ పూర్తి అవినీతిమయంగా మారిపోయింది. ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరం’ అని రావత్‌ అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top