రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు

Karne prabhakar on pragati nivedana sabha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్‌ రాజు, టీఎస్‌ఐఐసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచందర్‌రావు అన్నారు.

సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్‌ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు.

ట్రాఫిక్‌ జామ్‌ వల్లే రాలేకపోయారు: దానం
సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ జామ్‌ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్‌ పార్టీ బాగుపడుతుందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్‌ఎస్‌కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్‌ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్‌ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్‌కు కాంగ్రెస్‌ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉత్తమ్‌ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top