రసకందాయంలో కర్ణాటక ఎన్నికలు...!

Karnataka Elections Becomes Very Interesting - Sakshi

నామినేషన్లు ముగిశాక త్రిముఖ పోటీపై  స్పష్టత 

కన్నడ నాట ఎన్నికలు రసకందాయంలో పడుతున్నాయి.  మంగళవారంతో నామినేషన్ల దాఖలు ముగియనున్న నేపథ్యంలో  ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చాముండేశ్వరీ స్థానంలో గట్టిపోటీ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రెండోచోట బాదామి నుంచి పోటీకి కూడా సిద్ధమవుతున్నారు, పార్టీ ఆదేశిస్తే అక్కడి నుంచే సిద్ధరామయ్యపై పోటీకి తాను సిద్ధమంటూ బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యెడ్యూరప్ప కూడా ప్రకటించేశారు. అధికార కాంగ్రెస్‌పార్టీ తుది జాబితాలో కూడా చోటుదక్కని  సిట్టింగ్‌లు, ఇతర ఆశావాహులు ఇతరపార్టీల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్‌ నిరాకరణతో రెండోసారి ఎమ్మెల్యే  కావాలన్న కల నెరవేర్చుకునేందుకు పలువురు పక్కచూపులు చూస్తున్నారు.

వారిని బీజేపీ, జేడీ(ఎస్‌)  కూడా రెండుచేతులా సాదరంగా ఆహ్వానించేస్తున్నాయి. ఇదిలా ఉంటే నెలక్రితమే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఏడుగురు జేడీ(ఎస్‌) తిరుగుబాటు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ‘గెలుపు గుర్రాల’ కోసం వేచిచూస్తున్న  జేడీ(ఎస్‌),బీజేపీ  పలుస్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ ఎన్నికలో కింగ్‌మేకర్‌గా మారాలనుకుంటున్న  జేడీ(ఎస్‌) ఇప్పటికే  11 మంది అసంతృప్తులను చేర్చుకుంది.   ఈ విధంగా  వచ్చిన పావగడ ఎమ్మెల్యే జీవీ బలరాంకు యెడ్యూరప్ప టికెట్‌ ఖరారు చేయడంతో పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది.  ఫిరాయింపులు, టికెట్ల నిరాకరణల నేపథ్యంలో కాంగ్రెస్,బీజేపీ కేడర్‌  ఆయా ప్రాంతాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు.

అయితే దీనిని ఏమాత్రం పట్టించుకోని యెడ్యూరప్ప  ‘గెలిచే అవకాశాలున్న ఇతర పార్టీల వారికి’ తమ ఆహ్వానమంటూ ప్రకటించేశారు. ప్రధాన పార్టీలు టికెట్టు నిరాకరించినా ఇండిపెండెంట్లుగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నవారూ ఉన్నారు.  ఇప్పుడూ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే (2008లో బీజే పీకి మెజారిటీ కొరవడినపుడు ఆపార్టీలో చేరిన ఆరుగురు స్వతంత్రులకు మంత్రి పదవులు దక్కాయి) కీలకపాత్ర పోషించవచ్చునని వారు ఆశిస్తున్నారు. మరో రెండురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుండగా 380 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

త్రిముఖ పోటీ  ?
ఈ నెల 24వ తేదీతో అభ్యర్థుల నామినేషన్ల గడువు,  27న ఉపసంహరణల పర్వం ముగియనుంది. అప్పుడే  ఆయా నియోజకవర్గాల్లో పోటిపడే ప్రధానపార్టీల అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత రానుంది. ఇప్పటికైతే చాలా నియోజకవర్గాల్లో ప్రధానంగా  కాంగ్రెస్‌–బీజేపీ–జేడీ(ఎస్‌) ల మధ్య త్రిముఖ పోరు తప్పదనే ఊహాగానాలు సాగుతున్నాయి. కులం,మతం,ప్రాంతీయ, రాజకీయ తదితర సమీకరణల ఆధారంగా ఓటర్ల మొగ్గు ఎవరివైపు ఉంటుందనేది తేలనుంది.

అందువల్లే అభ్యర్థుల  ఎంపిక, ఆయా అంశాల ప్రాతిపదికన ప్రచారవ్యూహం, పోలింగ్‌బూత్‌ల మేనేజ్‌మెంట్‌ కీలకంగా మారునున్నాయి. బీజేపీ–జేడీ(ఎస్‌)ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న సిద్ధరామయ్య ఆరోపణలను, బీజేపీ–బీ టీమ్‌గా జేడీ(ఎస్‌) మారిపోయిందన్న రాహుల్‌గాంధీ విమర్శలను  ఈ పార్టీలు కొట్టిపాడేస్తున్నాయి.  తమ బలం అంతగా లేని చోట్ల జేడీ(ఎస్‌)కు మేలు చేకూర్చేలా బీజేపీ బలహీనమైన అభ్యర్థులను పెట్టొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.  తమ ఎమ్మెల్యేలు  క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా కాంగ్రెస్‌పార్టీ పట్ల జేడీ(ఎస్‌) ఆగ్రహంతో ఉంది. దీనిని క్యాష్‌ చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ ఉంది. 

తేల్చనున్న కులాలు, మతాల సమీకరణలు...
కర్ణాటకలోని  6.5 కోట్ల జనాభాలో 60 శాతానికిపైగా మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కావడంతో తమ సంక్షేమపథకాలు, కన్నడ సెంటిమెంట్, ప్రత్యేకమతంగా లింగాయత్‌  గుర్తింపు ప్రయత్నాలు తమను గెలుపు తీరాన్ని చేరుస్తాయనే ఆశాభావంతో సిద్ధరామయ్య ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతను తమ విజయానికి ఆయువుపట్టుగా మారుతుందని బీజేపీ, జేడీ(ఎస్‌)లు ఆశిస్తున్నాయి. మొత్తం 224 సీట్లలో 173 జనరల్‌ కేటగిరివి ఉంటే ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 సీట్లు రిజర్వ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా  సమీకరణలు ప్రధానపార్టీల అభ్యర్థుల గెలుపు తేల్చనున్నాయి.. దాదాపు 19 శాతమున్న లింగాయత్‌లు వంద వరకు స్థానాల్లో, 17శాతం వరకున్న ఎస్సీలు 40 సీట్లకు పైగా, 14 శాతం వరకున్న వొక్కళిగలు 40–50 చోట్ల, పధ్నాలుగున్నర శాతమున్న  ముస్లింలు, క్రిస్టియన్లు 30–40 నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చుననేది పార్టీల అంచనా.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top