రైతు పేరిట రుణం తెచ్చి ఎన్నికల పందేరం | Kannababu and Anil kumar yadav Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

రైతు పేరిట రుణం తెచ్చి ఎన్నికల పందేరం

Jun 13 2019 5:06 AM | Updated on Jun 13 2019 5:06 AM

Kannababu and Anil kumar yadav Fires On Chandrababu - Sakshi

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి: రైతుల పేరిట రుణాలు తెచ్చి ఎన్నికల తాయిలాల కింద పంపకం చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని రాష్ట్ర వ్యవసాయ, జల వనరుల శాఖ మంత్రులు కురసాల కన్నబాబు, పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. మంత్రులు ఇద్దరూ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా రుణ మాఫీని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక అనేక కోతలు పెట్టిన చంద్రబాబు రైతులను మోసం చేశా రని ధ్వజమెత్తారు. ఇప్పుడు నాలుగైదు విడతల రుణమాఫీని జగన్‌ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాదనే ఆనాడు తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ రుణమాఫీని ప్రకటించలేదని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల శాఖ తెచ్చిన రూ. 4,800 కోట్ల రుణాన్ని, కరువు నివారణ పనుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 932 కోట్లను దారి మళ్లించిన విషయం వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో బయటపడిందని కన్నబాబు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ఇంతవరకు సొమ్ము చెల్లించలేదని మండిపడ్డారు. గతేడాది రూ.1,800 కోట్లు, అంతకుముందు రూ.200 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పడిందని, తాజాగా కేబినెట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన చేశారని గుర్తుచేశారు.

వైఎస్సార్‌ రైతు భరో సా పథకం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలు గేళ్ల పాటు ఇచ్చే రూ.50 వేలను అధికారంలోకి వచ్చి న రెండో ఏడాదినుంచి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ  రైతులు కష్టాలలో ఉన్నారనే కారణంతో వచ్చే అక్టోబర్‌ నుంచే ఇస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులకు సకాలంలో విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.  

గజనీని తలపిస్తున్న చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు తీరు గజనీ మాదిరిగా ఉందని, ఆయనకు మతి చెడినట్టుందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తామని, పారదర్శకంగా, అవినీతి రహితంగా చేపడతామని తెలిపారు. జ్యుడీషియల్‌ కమిటీ వేసి రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకువస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే గుమ్మడికాయల దొంగ మాదిరిగా చంద్రబాబు భుజాలు తముడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణ పనుల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని, దీనిపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్‌ మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement