అప్పుల్లో, అవినీతిలో ఆదర్శమా..?

K Laxman Criticizes TRS Government For Not Recognizing The Sacrifice Of Students - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ వేడుకలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులకు జోహార్లు.. వారి బలిదానాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన ఆశయాలకు భిన్నంగా పాలక పార్టీ పనిచేస్తోందని లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలకు పరిమితమవుతోందే తప్ప అభివృద్ధి సాధించడంలో వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలు, అప్పులు అరాచకాలకు ఆదర్శంగా నిలిపిన ఘనత ప్రభుత్వానికే చెందుతుందంటూ ఎద్దేవా చేశారు. మా నాయకత్వం దేశానికే ఆదర్శం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

రైతుబంధు కాదు... రాబందు
అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని లక్ష్మణ్‌ విమర్శించారు. రెండు లక్షల కోట్ల అప్పు భారం ప్రజల మీద మోపారని మండిపడ్డారు. ఎదురుతిరిగిన నిరసన గొంతులను నలిపేస్తున్నారని రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చోటే లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మీద దాడులు చేస్తూ వారినే జైలుకు పంపిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడమే మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని లక్ష్మణ్‌ విమర్శించారు. లక్ష ఉద్యోగాలని చెప్పి కేవలం 20వేల కొలువులు కూడా కల్పించలేదని మండిపడ్డారు. టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రైతులకు రైతుబంధు పథకాన్ని తాయిలంగా చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది రైతుబంధు పథకం కాదు.. రాబందు పథకమని వ్యాఖ్యానించారు. రాజకీయ కొలువుల కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.

మోదీ సర్కారు పేదల పక్షం..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో దూసుకుపోతోందని లక్ష్మణ్‌ ప్రశంసించారు. దళారి వ్యవస్థ లేకుండా, అవినీతి లేకుండా పేదల కోసమే మోదీ సర్కారు పనిచేస్తోందని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top