సింధియా రాజీనామా : ఆమె చివరి కోరిక నెరవేర్చారు | Sakshi
Sakshi News home page

సింధియా రాజీనామా వెనుకున్న అసలు కథ

Published Tue, Mar 10 2020 6:45 PM

Jyotiraditya Scindia Fulfils Grandmother Vijaya Rajes Wish - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా, దాదాపు రెండు దశాబ్దాల పాటు నిఖార్సైన కాంగ్రెస్‌ వాదిగా ముద్రపడ్డ కేంద్రమాజీ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. జోతిరాధిత్య తండ్రి మాధవ్‌రావ్‌ సింధియా తొలుత జన్‌సంఘ్‌ నుంచి రాజకీయాలను ప్రారంభించిన్పటికీ అనంతరం కాంగ్రెస్‌లో చేరి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు గుర్తింపుపొందారు. మాధవరావ్‌ మరణం అనంతరం గ్వాలియర్‌ రాజవంశం బాధ్యతలన్నీ జ్యోతిరాధిత్య సింధియానే చూసుకున్నారు. ఈ క్రమం‍లో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. తండ్రి మరణం అనంతరం రాజకీయ అరంగేట్రం చేసిన సింధియా 2002లో గుణ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. మొత్తం ఆయన నాలుగుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

మార్చి 10 వెనుక అసలు కథ..
యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. 2014లో దేశమంతా బీజేపీ గాలి వీచినా గుణలో మాత్రం ఆయన గెలుపొందడం విశేషం. అయితే ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌లో ఉన్న విభేదాల కారణంగా ఎవరూ ఊహించని విధంగా జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అయితే సింధియా మంగళవారమే రాజీనామా చేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. ఆయన తండ్రి మాధవ్‌రావు సింధియా జయంతి ఈరోజే (మార్చి 10) కావడం విశేషం. ఈ విషయాన్ని జ్యోతిరాధిత్య సింధియా స్వయనా మేనత్త బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే వెల్లడించారు. తాజా రాజీనామాపై ఆమె మాట్లాడతూ.. ‘జ్యోతిరాధిత్య కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం సంతోషంగా ఉంది. ఆయన తండ్రి మాధవ్‌రావు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీజేపీలోకే ఆయన తిరిగి వస్తున్నారు. జన్‌సంఘ్‌ నిర్మాణంలో మాధవ్‌రావు తల్లి, రాజమాత విజయయి రాజే సింధియా కీలక పాత్ర పోషించారు. తన కుటుంబమంతా సంఘ్‌లోనే కొనసాగాలని ఆమె చివరి కోరిక. దానిని సింధియా నెరవేరుస్తున్నారు’ అని అన్నారు. (రాజ్యసభకు సింధియా.. కేంద్రమంత్రి పదవి!)

చిచ్చుపెట్టిన సీఎం పీఠం
కాగా 2018లో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిక సమయంలో తీవ్ర ఆధిపత్య పోరు, నాయకత్వ లోపంతో బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్‌కు సింధియా ఆశాదీపంలా కనిపించాడు. అంతాతానై పార్టీని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చారు. అయితే సీఎం పీఠం తనకే దక్కుతుందని భావించిన సింధియాకు హస్తం అధిష్టానం మొండిచేయి చూపింది. కమల్‌నాథ్‌కు సీఎం పీఠాన్ని అప్పగించింది. అయితే పార్టీలో యువతకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో తీవ్రంగా విఫలమైన కాంగ్రెస్‌ అధిష్టానం.. తనకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గత లోక్‌సభ ఎన్నికల్లో గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచిపోటీచేసిన సింధియా.. సిట్టింగ్‌ స్థానంలో ఘోర పరాజాయాన్ని చవిచూశారు. (మధ్యప్రదేశ్‌ సంక్షోభంలో మరో ట్విస్ట్‌)

బీజేపీ గూటికి.. మంత్రిపదవి..!
అప్పటికే ముఖ్యమంత్రి పీఠం దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న సింధియా కమల్‌ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు దిగడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తొలుత పదిమంది ఎమ్మెల్యేలను, ఆ తరువాత ఏకంగా 18 మంది  ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా తిప్పుకున్నారు. అనంతరం తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా  ఎగరేసి.. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆ నేపథ్యంలోనే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేసి మోదీ మంత్రివర్గంలో ఆయనకు కేంద్రమంత్రి పదవిని సైతం కట్టబెడతారని సమాచారం.

Advertisement
Advertisement